హుజురాబాద్ పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో ఉన్న రాఘవరెడ్డి, అతని భార్యపై దాడి చేశారు. మెడపై కత్తులు పెట్టి బెదిరించి ఇంట్లో ఉన్న సుమారు 72 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫోన్లు కూడా దొంగలు బయటపడేశారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన రాఘవరెడ్డికి అతని భార్యకు స్వల్ప గాయాలు కావడంతో విషయం తెలుసుకొని వచ్చిన రాఘవరెడ్డి కుటుంబీకులు గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో సీఐ తిరుమల్ గౌడ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు, డ్వాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. సంఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ, అపరిచిత వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట కనిపిస్తే వెంటనే 100 కు డయల్ చేయాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నుండి ఒంటరిగా బయటకు రావద్దని అన్నారు. భారీ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.