ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టును ఓడించిన రోహిత్ సేన తుది పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. అత్యధికంగా ఐసీసీ టోర్నమెంట్లలో జట్టును ఫైనల్‌గా చేర్చిన తొలి కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.
2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఇందులో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ విజయం సాధించి కప్ ముద్దాడాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni) 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీల్లో టీమిండియాను ఫైనల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించాడు. ఈ మూడు టోర్నీల్లో భారత్ కప్ గెలవడం విశేషం. ఇక విరాట్ కోహ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు మాత్రం ఓసారి తీసుకెళ్లాడు. అయితే టీమిండియా కప్ గెలవలేదు.