కరీంనగర్ నుంచి తిరుపతికి రోజూ రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam prabhakar) కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారని తెలిపారు.
‘‘ప్రస్తుతం కరీంనగర్ నుంచి గురువారం, ఆదివారం మాత్రమే తిరుపతికి రైలు వెళ్తోంది. అదే రైలు తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో తిరిగి బయలుదేరుతుంది. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైలును ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్లడానికి వీలుగా, సులభతరంగా ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఉత్తర తెలంగాణ నుంచి ప్రస్తుతం తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజూ రైలు నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గత పదేళ్లుగా కోరుతున్నాను. ప్రయాణికుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని కరీంనగర్ నుంచి తిరుపతికి రోజు రైలు నడిచేలా చర్యలు తీసుకోండి’’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.