దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీల( Sri Chaitanya Institutions)పై ఐటీ సోదాలు( IT Rides) నిర్వహిస్తున్నారు అధికారులు. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావటంతో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం శ్రీ చైతన్య విద్యా సంస్థలు కోసం మరొ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
అక్రమ లావాదేవీలు జరపడంతో పాటు పన్ను ఎగవేశారనే ప్రధాన అభియోగాలతో ఐటీ అధికారులు ఉదయం నుంచి కూడా చైతన్య కళాశాలలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలతో పాటు కొన్ని బ్రాంచుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ లావాదేవీలు, ఫీజులు..వీటన్నింటికి సంబంధించి కీలక డాక్యమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఐటీ శాఖ అధికారులను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. సోదాలన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించి ఐటీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.