అవధూత కాశినాయన (Kasinayana Ashram) ఆశ్రమం కూల్చివేత వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ చర్చకు తావిచ్చింది. దీంతో ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశీనాయన ఆశ్రమం వద్ద అటవీ అధికారులు కూల్చిన పలు షెడ్లను సొంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చిన నారా లోకేష్ 24 గంటల్లోనే పునర్ నిర్మాణం పనులు ప్రారంభించారు. కూల్చిన షెడ్లను తొలగించి నూతన షెడ్ల నిర్మాణం పనులను మొదలుపెట్టారు.
నారా లోకేష్ హామీ
కాశీనాయన ఆశ్రమం కూల్చివేత విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి ధీటుగా మంత్రి నారా లోకేష్ బదులిచ్చారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలో ఉన్న కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం అన్నారు. అటవీ నిబంధనలు ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు పరిగణలోకి తీసుకుని అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చివేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నా అన్నారు. అంతేకాదు.. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటూ తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వెంటేనే నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు.
అవధూత కాశీనాయన ఎవరు?
అవధూత కాశీనాయన ఈయన ఆధ్యాత్మిక గురువు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లిలో జన్మించారు. కాశమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఈయన అసలు పేరు కాశిరెడ్డి. బాల్యంలోనే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అతిరాచ గురువయ్య బోధనలతో ప్రభావితుడై ఎన్నో తీర్థయాత్రలు చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్నో క్షేత్రాలు దర్శించారు.

గురువు ఆదేశానుసారం
పాడుబడిన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమని చెప్పిన గురువు ఆదేశాల మేరకు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు.1895 జనవరి 15న జన్మించిన ఆయన 1995 డిసెంబరు 6 న పరమపదించారు. కాశీనాయన మరణానంతరం జ్యోతిక్షేత్రం..కాశీనాయన క్షేత్రంగా మారింది. ఈ క్షేత్రం నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట ఉందని చెబుతారు.
కాశీనాయన ఆరాధనోత్సవాలు
ఆళ్ళగడ్డకు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఏటా దత్త జయంతి సమయంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యం వేలమందికి అన్నదానం జరుగుతుంటుంది. పాడుపడిన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి అక్కడ నిత్యం అన్నదానం జరిగేలా కాశీనాయన అప్పట్లోనే ఏర్పాట్లు చేశారని స్థానికులు చెబుతారు.

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆశ్రమాలు
కాశీ నాయన పేరుమీద తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆశ్రమాలున్నాయి..అక్కడ నిత్య అన్నదానాలు నిర్వహించడంతో పాటూ గోవులను సంరక్షిస్తుంటారు. ఈయన జీవిత కథ.. సమర్థ సద్గురు కాశీనాయన అనురాగ జీవితం, అవధూత కాశీరెడ్డి నాయన సంపూర్ణ చరిత్ర పేరుతో పుస్తకాలుగా ముద్రితమైంది.
టైగర్ జోన్ పరిధి
కాశినాయన క్షేత్రం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇదంతా టైగర్ జోన్ పరిధిలో ఉంది. ఇక్కడకు నిత్యం భక్తుల రద్దీ ఉండడంతో వారికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండాలంటే ఈ సత్రాన్ని ఖాళీ చేయించాలంటున్నారు అటవీశాఖాధికారులు. అయితే నిత్యం వేలమందికి అన్నదానం చేసే ఈ సత్రాన్ని ఇక్కడి నుంచి తరలించడం సరికాదన్నారు భక్తులు. అయితే భక్తుల రక్షణార్థం ఆశ్రమం, ఆలయం చుట్టూ తగిన చర్యలు తీసుకుంటే మంచిదంటున్నారు.