ప్రస్తుతం రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు ముందుగా అందరూ దాని కెమెరా నాణ్యతను చూస్తారు. ఎన్ని మెగాపిక్సెల్స్ ఉందో చూడటం సర్వసాధారణం. అయితే మన కంటి మెగాపిక్సెల్స్ ఈ కెమెరాల కంటే చాలా ఎక్కువ అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మన కళ్ళలో సహజ లెన్సులు ఉంటాయి, ఇవి కెమెరా లెన్స్‌ల మాదిరిగానే పనిచేస్తాయి. మన కంటిని డిజిటల్ కెమెరాతో పోలిస్తే, ఇది 576 మెగాపిక్సెల్స్ వరకు చూడగలదు. ఏ స్మార్ట్‌ఫోన్ కెమెరా కూడా మన కంటి సామర్థ్యానికి సరితూగదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మానవ కన్ను కెమెరా వలె పనిచేస్తుంది. ఇది ప్రధానంగా మూడు భాగాలను కలిగి ఉంటుంది.. లెన్స్, సెన్సార్ మరియు ప్రాసెసర్. లెన్స్ కాంతిని సేకరించి చిత్రాన్ని సృష్టిస్తుంది. సెన్సార్ ఆ కాంతిని ఎలక్ట్రికల్ సిగ్నల్‌గా మారుస్తుంది. చివరగా, ప్రాసెసర్ ఈ సిగ్నల్స్‌ను చిత్రాలుగా మార్చి మన మెదడుకు పంపుతుంది.
మన కన్ను 576 మెగాపిక్సెల్స్ వరకు చూడగలిగినప్పటికీ, మన మెదడు అంత డేటాను ఒకేసారి ప్రాసెస్ చేయలేదు. అందుకే మనం చూసే హైడెఫినిషన్‌లో కొన్ని భాగాలను మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, కాబట్టి ఏదైనా సన్నివేశాన్ని సరిగ్గా చూడటానికి మన కళ్ళను ఆ దిశలో కదిలించాలి.
వయసు పెరిగే కొద్దీ మన శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే కంటి రెటీనా కూడా బలహీనపడుతుంది. ఇది మన చూసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది, అంతేకాకుండా మన కళ్ల మెగాపిక్సెల్ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.