రాష్ట్రంలో ప్రముఖ దేవాలయమైన ఒంటిమిట్ట రామాలయాన్ని(Ontimitta Ramalayam) ఆధ్యాత్మిక పర్యాటకం (టెంపుల్ టూరిజం) పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఉందని, త్వరలోనే ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం శాసనమండలిలో సభ్యులు వి.రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి దుర్గేష్ స్పష్టమైన వివరణనిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ టెంపుల్ టూరిజం క్రింద ఒంటిమిట్ట సీతారామ స్వామి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఆ దేవాలయం క్రింద చుట్టు ప్రక్కల ఉన్న దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశవ స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండరామాలయం టెంపుల్, గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్, నందవరం చౌడేశ్వరి మఠం, మహానందీశ్వర స్వామి టెంపుల్ లను కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ఆలోచనను చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఒంటిమిట్ట సీతారామ స్వామి వారి దేవాలయం తిరుపతి తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడుస్తోందని తెలిపారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పాలసీ ద్వారా ఆధ్యాత్మిక టూరిజంకు కొన్ని టెంపుల్స్ ని, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ టూరిజం ఇలా వివిధ రకాల టూరిజం లతో పాటు విభిన్న సర్క్యూట్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం ఒంటిమిట్ట, ఆయా ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు లేదా భక్తులు ఉదయం వచ్చి సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతున్నారని, ఈ క్రమంలో అక్కడికి వచ్చే పర్యాటకులను లేదా భక్తులను రెండు మూడు రోజులు ఉంచాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆ చుట్టు పక్కల ప్రదేశాలను సర్క్యూట్ గా తయారు చేసి ఆ ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని, టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నామన్నారు. ఒంటిమిట్ట చెరువును పూర్తిస్థాయిలో ఆధునికీరించి చెరువులోకి నీరు వచ్చే విధంగా చేస్తున్నామని, అంతేగాక ఆ చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఇతర దేవాలయాలను కలుపుకొని సర్క్యూట్ తయారుచేస్తే పర్యాటకులు రెండు మూడు రోజులు ఉండేందుకు అవకాశం ఉంటుందని, అలా ఉండాలంటే అక్కడ రిసార్ట్స్ లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందన్నారు..
గడిచిన ఐదేళ్లలో ఒంటిమిట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్ నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ హరిత రిసార్ట్స్ లో కేవలం 4 గదులు మాత్రమే ఉన్నాయని, వాటిని శుభ్రపరిచి, వాటి సంఖ్యను పెంపొందించి మరిన్ని సౌకర్య వంతమైన రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పరిశుభ్రత, భక్తుల సౌకర్యాల విషయంలో నాడు తీసుకున్న నిర్ణయాల వల్ల గడిచిన ఐదారేళ్లుగా ఒంటిమిట్ట క్షేత్రం అలక్ష్యానికి గురైందని విమర్శించారు. క్యూ ఆర్ కోడ్ తో ఇంటిగ్రేట్ చేసి మల్టీ లాంగ్వేజ్ యాక్టివిటీని ఏర్పాటు చేయాలని, అక్కడికి వచ్చిన వారు పూర్తిస్థాయిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం కూడా స్థల ప్రాశస్త్యం గురించి తెలియజేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. అదే విధంగా అక్కడున్న రెస్టారెంట్స్ అద్భుతంగా నడుస్తోందని, దాన్ని ఆధునీకరించి పూర్తిస్థాయిలో భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం ద్వారా రాష్ట్రంలో టెంపుల్స్ డెవలప్ మెంట్ కి అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ మధ్యనే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి విషయమై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఢిల్లీలో కలిసి చర్చించానని గుర్తుచేశారు. రాష్ట్రంలో చాలా టూరిజం ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించామని, తమ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి మంచి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తమతో అన్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఏప్రిల్ తర్వాత ఒంటిమిట్ట క్షేత్రంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి అధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా శాసనమండలిలో మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.