వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు (Butch Wilmore) ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ, మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లతో కలిసి సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది.
క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో
గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది.
తొమ్మిది నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో ఐఎస్‌ఎస్ నుంచి బయల్దేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇంజిన్లను మండించి క్రూ డ్రాగన్‌ను భూవాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. దీని ల్యాండింగ్ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.