ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates)తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశం వివరాలకు ఎక్స్ వేదికగా చంద్రబాబు పంచుకున్నారు. బిల్‌గేట్స్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిపై చర్చించడానికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చ జరిపామని వివరించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలలో సేవలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగంపై చర్చించామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌ను సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం ఈ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాను నమ్ముతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిల్ గేట్స్ అందిస్తానన్న సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.