ఎన్నికల వ్యూహకర్తగా అమిత్ షాకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. దేశంలో బీజేపీ జెండాను ప్రతి రాష్ట్రానికి, జిల్లాకు, ఊరికి తీసుకెళ్లడంలో ఆయన పకడ్బందీ ప్రణాళికను ఎవరూ కాదనలేరు. ఇందులో మస్కట్ గా ప్రధాని మోడీని ప్రయోగిస్తూనే, తెరవెనుక అవసరమైన ఎత్తులన్నీ షా వేస్తూవచ్చారు. అందుకే ‘మోడీ పాపులారిటీ, షా జనరల్ షిప్’ రెండూ కలిపి బీజేపీకి ఎన్నో విజయాలు తెచ్చిపెట్టాయనేది రాజకీయ పండితులంతా మెచ్చుకుంటారు.
అమిత్ షాకున్న మరోపేరు ‘ఎలక్షన్ మెషిన్’ అని. కానీ ఈ ఎలక్షన్ మెషిన్ కు ఓ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. అదే ఆయన సొంత ఊరున్న నియోజకవర్గం మన్సా. గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో ఉన్న మన్సాలో 16 ఏళ్లపాటు ఆయన తన బాల్యాన్ని గడిపారు. ఇప్పటికీ షా చుట్టాలు చాలా మంది ఇక్కడే ఉంటున్నారుకూడా. 2012 ఎన్నికల నుంచీ ఇక్కడ బీజేపీ ఓటమిపాలు అవుతూ వస్తోంది. నిజానికి బీజేపీకి కంచుకోటగా 1995-2007 వరకు ఉన్న మన్సాలో గత రెండు ఎన్నికల్లో కమలనాథులు పట్టుకోల్పోయారు. ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ కాంగ్రెస్ ను చిత్తు చేయాలని అమిత్ షా మాస్టర్ ప్లాన్ వేసి, అమలు చేస్తున్నారు. తన ఎత్తుగడలకు మరింత పదును, కొత్తదనం జోడించిన షా ఇక్కడ ఎలాగైనా బీజేపీ గెలిచేలా పాచికలు వేస్తున్నారు.
గుజరాత్ లో వరుసగా ఏడవసారి బీజేపీని అధికారంలోకి తెస్తూ, మన్సాలో గెలిచేందుకు అవసరమైన ప్రత్యేక కసరత్తులు షా గట్టిగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడికి ఆయన పదేపదే రాకపోకలు సాగించారు. ఎలక్షన్ ఇయర్ కావటంతో మన్సా నియోజకవర్గంలో ఎన్నో రిబ్బన్ కటింగులను ఈ ఇయర్ ఆయన చేస్తూవచ్చారు. అమిత్ షా పూర్వికులు ఇక్కడికి 1361లో వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన పూర్వికుల ఇల్లు ఇక్కడ శిథిలావస్థలో ఉంది. ప్రతి ఏటా నవరాత్రికి ఇక్కడికి వచ్చి, తమ కులదేవతకు ఆయన పూజలు చేసి వెళ్తారు.
2024కల్లా మన్సాను ‘హైటెక్ ఫెలసిలిటీస్’ తో కొత్త రూపురేఖలు తెస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఇందుకు అనుగుణంగానే తరచూ ఇక్కడ అభివృద్ధి పథకాలకు భారీఎత్తున నిధులను సైతం విడుదల చేస్తున్నారు. ఠాకూర్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పక్షాన వీరంతా నిలుస్తుండటం బీజేపీకి మింగుడుపడటం లేదు. పాటిదార్లు, ఠాకూర్లు కాంగ్రెస్ కు అండగా ఉండటంతో ఈసారికూడా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈసారి ఇక్కడ పటేల్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించింది బీజేపీ. జేఎస్ పటేల్ అనే ఈ అభ్యర్థి మొదటిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నాడు. దీంతో ప్రత్యర్థి పార్టీలు ఈయనపై పెద్దగా ఆరోపణలు చేసేందుకు ఛాన్స్ లేకుండా బీజేపీ నెగటివ్ క్యాంపెయిన్ కు చెక్ పెట్టింది.
వారానికి మూడు రోజులు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎక్సర్ సైజ్ కోసం కేటాయించిన షా ప్రతి విషయాన్ని మైక్రో మేనేజ్ చేస్తున్నారు. అమిత్ షా ఫోన్ లో ప్రతి నియోజకవర్గం బూత్ లెవెల్ డాటా నిక్కచ్చిగా, అప్డేటెడ్ గా పెట్టుకుంటారు. అంతేకాదు తనను కలిసే అభ్యర్థులకు ఈ డేటాపై చక్కని అవగాహన ఉండితీరాల్సిందే, లేదంటే షాతో మాట్లాడేటప్పుడు చాలా కష్టమైన పని. 27 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి సహజంగానే బీజేపీపై గుజరాతీల్లో ఎక్కువ కంప్లైంట్లు, అధికార వ్యతిరేకత ఉంటుందని, కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలతో షా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు పార్టీ అభ్యర్థులు చెబుతున్నారు.
అమిత్ షా నమ్మే సిద్ధాంతం ఒకటే..ఇదే ఆయన అభ్యర్థులకు, కేడర్ కు నిత్యం నూరిపోస్తున్నారు. గెలుపు, ఓటర్లు ఈ రెండింటినీ ‘టేకన్ ఫర్ గ్రాంటెడ్’ గా ఎప్పుడూ తీసుకోరాదని. అందుకే కాంగ్రెస్, ఆప్ ల నుంచి ఎంత పోటీ ఉందో గుర్తించి, క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకోవాల్సిందేనని ఆయన అల్టిమేటం ఇస్తున్నారు. నిత్యం ఇదే హితోపదేశం చేస్తూ పార్టీ శ్రేణుల్లో తమ కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నారు షా.
షా మాటలు అచ్చం తూటాల్లానే చాలా పదునుగా ఉంటాయి. ‘మా-బేటా’ అంటూ ఆయన సోనియా-రాహుల్ ను విమర్శించినా ‘యాంటీ గుజరాత్’ అంటూ ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టినా అన్నీ షా స్టైల్ లో ఉంటాయని గుజరాతీలు సగర్వంగా చెప్పుకుంటారు. 2002లో యాంటీ సోషియల్ శక్తులకు గట్టి బుద్ధి చెప్పామని గోద్రా అల్లర్ల వంటి సున్నితమైన అంశాలను వెలికి తీసి, నాటి గాయాలను తిరగతోడుతూ.. నోటితో చెప్పకనే గట్టి హెచ్చరిక, సందేశాన్ని ఆయన ఇస్తుండటం చూస్తుంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీకి కేక్ వాక్ అని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎన్నో మతకల్లోల్లాలు జరిగేవని గుర్తు చేసిన ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో తాము ‘శాశ్వతమైన శాంతి’ని ఎలా స్థాపించారో చెబుతూ గుజరాతీలకు నాటి ఘటనలను బాగా గుర్తుకు తెస్తున్నారు.
మోడీ తరువాత ముగ్గురు సీఎంలను రాష్ట్రంలో బీజేపీ మార్చింది. ఆనంది బెన్ పటేల్, ఆతరువాత విజయ్ రూపాణి, తరువాత భూపేంద్ర పటేల్..ఇలా ఎవరు సీఎంలు అయినా చివరికి ‘బ్రాండ్ మోడీ’ మాత్రమే ఇక్కడ పార్టీకి ఆయువు పట్టుగా ఉంటూవస్తోంది.
ఈసారి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ కావటంతో రెబెల్స్ పెద్ద సంఖ్యలో పార్టీకి చిక్కులు సృష్టించారు. ఈనేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన షా చాలా డిప్లమెటిక్ గా రెబెల్స్ కూడా బీజేపీ ఫ్యామిలీలో సభ్యులని కొత్త సమీకరణం తెచ్చి వారిని సింపుల్ గా బుజ్జగించేశారు. ఇందుకు వన్ ఆన్ వన్ మీటింగులు ఏర్పాటు చేసి, వారి డిమాండ్లు, ఫిర్యాదులను సానుకూలంగా విని, వాళ్ల ఈగోకు ఆయన చెక్ పెట్టేశారని గుజరాతీ మీడియా వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో రెబెల్స్ బీజేపీకి చిక్కులు సృష్టించినా, వీటిని తక్షణం పరిష్కరించేందుకు ఉన్నత స్థాయిలో చర్యలు చేపట్టడంతో సరైన సమయంలో డ్యామేజ్ కంట్రోల్ ను పార్టీ చేయగలిగింది.
ఇక గుజరాత్ అంటేనే వ్యాపారుల రాజ్యంగా పేరుగాంచింది. ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 211 మంది ఆగర్భ శ్రీమంతులున్నారు. 211 మంది కోటీశ్వరులు తొలిదశలో పోటీలో ఉన్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి నిరక్షరాస్యులైన అభ్యర్థులు ఎక్కువమందే ఉండటం మరో విశేషం. తొలి దశ పోలింగ్ లో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకుగానూ మొత్తం 788 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో దిగారు. వీరిలో 27శాతం మంది అభ్యర్థుల ఆస్తుల చిట్టాలు కోటి రూపాయల పైమాటే.
89 నియోజకవర్గాల్లో 89 మంది బీజేపీ అభ్యర్థుల్లో 79 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్ కు చెందిన 65 మంది అభ్యర్థులు, ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్న 33 మంది అభ్యర్థులు కూడా కోటీశ్వరులే. రాజ్ కోట్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న రమేష్ తిలలా అనే బీజేపీ అభ్యర్థి ఆస్తులు ఏకంగా 175 కోట్ల పైమాటేకాగా ఈయన అందరికంటే అతిపెద్ద ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచారు.
ఈ విషయాలన్నీ ఒక ఎత్తైతే వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికలకు కూడా అమిత్ షా, మోడీ ద్వయం మంచి స్కెచ్ వేస్తోంది. ఈమేరకు దేశంలోని మొత్తం 144 లోక్సభ స్థానాలను ఎంపిక చేసిన బీజేపీ, వాటిపై ప్రత్యేక ఫోకస్ ఎప్పటినుంచో మొదలు పెట్టేసింది కూడా. విపక్ష పార్టీల చేతుల్లోని కీలకమైన ఆ స్థానాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని రాయ్ బరేలి, దివంగత ములాయం సింగ్ యాదవ్ సొంత నియోజకవర్గం మెయిన్ పురి, ఎన్సీపీ అధినేత కుమార్తె సుప్రియా సూలే నియోజకవర్గం బారామతి, మిమి చక్రబర్తి నియోజకవర్గం జాదవ్ పూర్, తెలంగాణలోని మహబూబ్ నగర్, నకుల్ నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ లోని చింద్వారా..ఇలాంటి హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో బీజేపీ సుదీర్ఘమైన ప్రచార కార్యక్రమాలు తలపెట్టింది. ఈ 144 లోక్ సభ స్థానాల చుట్టూనే మోడీ మెగా ర్యాలీలు జరిగేలా ‘క్లస్టర్ ప్లాన్’ ను అమలు చేస్తున్నారు.
క్లస్టర్ ప్లాన్ లో భాగంగా ముందు పలువురు కేంద్ర మంత్రులు ఇక్కడ పర్యటిస్తారు. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2లో భాగంగా ప్రధాని మోడీ ఇక్కడ జరిగే భారీ ర్యాలీలలో పాల్గొంటారు. ఇలా ఈ హై ప్రొఫైల్ 144 లోక్ సభ స్థానాల్లో బీజేపీని మరింత బలోపేతం చేస్తారన్నమాట. ఈ నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రాంతాలన్నీ బీజేపీ గెలవలేకపోయినవే. అందుకే పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలని బీజేపీ కొత్త వ్యూహాన్ని సరికొత్తగా అమలుచేస్తోంది. దీనికి ‘మిషన్ 2024’ అనే పేరుపెట్టి, పలు నియోజకవర్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. యుద్ధకాలే శస్త్రాభ్యాసే అనే మిగతా పార్టీల్లా కాకుండా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ప్రిపరేషన్ మొదలు పెట్టేసి, పార్టీని బలోపేతం చేయటం, పార్టీకి విజయం చేకూర్చటం అనే లాంగ్ రన్ స్కెచ్ అమిత్ షా చాణక్యతకు అద్దం పడుతుంది. మొత్తానికి ఎన్నికల వ్యూహాలు ఎలా చేయాలని మిగతా పార్టీలు కూడా వీరి నుంచి చాలా నేర్చుకోవాలి.