తెలంగాణకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)ని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న తరుణంలో సోనియా గాంధీ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆమెతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా గురించి సోనియాకు వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై చర్చించారు. అనంతరం లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిశారు.
వారిని కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
