తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కీలక ప్రకటన చేసి సంచలనాన్ని రేపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇది తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదివరకే అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, అన్నామలై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇటీవల అన్నాడీఎంకే నేత పళని స్వామి, పార్టీ కీలక నాయకులు ఢిల్లీలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిశారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడెవరనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే, కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మహిళా ఓటర్లను ఆకర్షించాలనే వ్యూహంలో భాగంగా పార్టీ ఆమెను ఎన్నిక చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు, కేంద్ర సహాయమంత్రి ఎల్. మురుగన్, బీజేపీ కీలక నేత కోయంబత్తూర్ మురుగానందం పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, మురుగానందం, అన్నామలై చేపట్టిన ఎన్ మన్-ఎన్ మక్కళ్ యాత్ర విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మార్పులు తమిళనాడు బీజేపీ భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతాయనే దానిపై రాజకీయ పరిశీలకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొత్త నేతపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.