అభినవ భింద్రన్‌వాలేగా భావిస్తున్న ఒక ఖలిస్థాన్ తీవ్రవాది ఇటీవల ఒక పోలీస్ స్టేషన్‌లో జొరబడి, తన సహచరుడైన ఓ ఖైదీని విడిపించుకుని వెళ్లిపోవడం, గత శనివారం అరెస్టు నుంచి తప్పించుకోవడం తీవ్రంగా ఆందోళన కలిగించే సంఘటన. పోలీసుల కన్నుగప్పి అతను అతి లాఘవంగా తప్పించుకుపోవడాన్ని సాహసోపేత చర్యగా అభివర్ణించలేం కానీ, అతని ఘాతుకాన్ని క్షమించి వదిలేసే అవకాశం మాత్రం లేదనే చెప్పాలి. పోలీసులు అతని సహచరులందరినీ అరెస్టు చేయగలిగారు. అయితే, అతను మాత్రం తప్పించుకోగలిగాడు. ఈ అమృత్‌పాల్ సింగ్ తానొక బోధకుడిననీ, ప్రవచన కర్తననీ చెప్పుకుంటుంటాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఆపేయడం వల్ల అతని పన్నాగం గురించి పోలీసులు తెలుసుకోలేకపోయారు. గత ఫిబ్రవరి నెలలో అమృత్ పాల్ సింగ్ నాయకత్వంలో జనం కత్తులు, కఠార్లు పట్టుకుని వీధుల్లో ప్రదర్శనలు జరిపినప్పుడు పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండాల్సి వచ్చింది. అయితే, ఈసారి మాత్రం వారు కఠినంగా వ్యవహరించారు. ముందుగా పోలీసులు అతనికి ఆశించిన ప్రచారం రాకుండా, ప్రజల నుంచి సానుభూతి వ్యక్తం కాకుండా చర్యలు తీసుకున్నారు. జి-20 సమావేశం జరిగిన మరునాడు పంజాబ్‌లో ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ, సమావేశం మీద దీని ప్రభావం పడకుండా, సమావేశానికి ఎటువంటి ఆటంకమూ జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.
ఖలిస్థాన్ తీవ్రవాదుల నాయకుడు జర్నాయిల్ సింగ్ భింద్రన్‌వాలే మాదిరి వేష భాషలతో అతను వ్యవహరిస్తున్నాడు. చేతిలో బాణం పట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని, చుట్టూ సాయుధ అంగరక్షకులతో అతను తిరుగుతుంటాడు. అయితే, ప్రవచనాలు చెప్పడంలో అతను సిద్ధహస్తుడేమీ కాదు. అందులో అతను శిక్షణేమీ పొందలేదు. పైగాసిక్కు మత సిద్ధాంతాలను కూడా అతను ఔపోసన పట్టిన వ్యక్తి కాదు. ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన అమృత్ పాల్ సింగ్ తీవ్రవాదంలో మాత్రం ఆరితేరాడు. అంతేకాదు, మత గురువులతో సంబంధం లేకుండా తనకు తోచినట్టుగా మతపరమైన ఆదేశాలు ఇస్తూ సిక్కు మతస్థులను సైతం హడలగొడుతుంటాడు. ఇక మత భావనలను రెచ్చగొడుతూ అతను చేస్తున్న ప్రసంగాలు క్రమంగా తీవ్రవాద ధోరణులను ప్రతిబింబిస్తున్నాయి. హోం మంత్రి అమిత్ షా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లకు కూడా ఇందిరా గాంధీ, బియాంత్ సింగ్‌లకు పట్టిన గతే పడుతుందంటూ అతను ఈ మధ్య హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో భింద్రన్‌వాలేను ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో హతమార్చినందుకు ప్రతీకారంగా ఇందిరా గాంధీని, బియాంత్ సింగ్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే.అతని చర్యలు, ప్రేలాపనలు ఉధృతమవుతున్నప్పటికీ, అమిత్ షా సూచించేవరకూ రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చర్య తీసుకోవడం జరగలేదు.
ఉద్యోగాలు లేకపోవడం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, పాకిస్థాన్ నుంచి ఆయుధాలు లభిస్తుండడం, ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోకపోవడం వంటి కారణాల వల్ల పంజాబ్ యువతసంఘ వ్యతిరేక కార్యకలాపాలకు, దేశ ద్రోహ కార్యకలాపాలకు అలవాటు పడుతోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, యువతలో తలెత్తుతున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అమృత్ పాల్ సింగ్ ఖలిస్థాన్ ఉద్యమ నాయకుడుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఈ కార్యకలాపాలకు కావాల్సిన నిధులు విదేశాలలోని ఖలిస్థాన్ నాయకుల నుంచి నిధులు, పాకిస్థాన్ నుంచి అందుకు అవసరమైన ఆయుధాలు అందుతున్నాయి. అతనొక పెనుభూతంగా, బ్రహ్మరాక్షసిగా మారేలోగా అతని ఆటకట్టించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పోలీసులకు రాజకీయ నాయకుల నుంచి, పాలకుల నుంచి కూడా సహాయ సహకారాలు అందాల్సి ఉంది. పంజాబ్ మళ్లీ తీవ్రవాదంలోకి జారిపోవడం అటు రాష్ట్రానికి, ఇటు దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.