కెనడాలో(Canada) కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఉన్నత విద్య చదివేందుకు అక్కడికి వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. అంటారియో ప్రావిన్స్‌లోని హామిల్టన్ నగరంలో బుధవారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధావా (21) అనే విద్యార్థిని స్థానిక బస్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్నారు. అదే సమయంలో రెండు కార్లలోని వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఒక బుల్లెట్ హర్‌సిమ్రత్ ఛాతీకి తగలడంతో ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాల్పుల ఘటనతో హర్‌సిమ్రత్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రెండు వాహనాల మధ్య జరిగిన గొడవలో ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా హర్‌సిమ్రత్ మృతిపై భారత కాన్సులేట్ జనరల్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. హర్‌సిమ్రత్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.