హైడ్రా(Hydra) మరోసారి దూకుడు ప్రదర్శించింది. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు(Vasantha Krishna Prasad) ఊహించని షాక్ ఇచ్చింది. హాఫీజ్ పేటలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ అందులో ఉన్న నిర్మాణాలను కూల్చి వేసింది. కూల్చివేసిన నిర్మాణాల్లో వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్ కూడా ఉంది. మొత్తం 17 ఎకరాలను స్వాధీనం చేసుకుని హైడ్రా బోర్డు పెట్టేసింది.
తాను ఇరవై ఏళ్ల కిందటే ఈ భూములను కొన్నానని వసంత కృష్ణప్రసాద్ పత్రాలు చూపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఎన్వోసీ ఇచ్చారని కోర్టుల్లో కూడా ఎలాంటి కేసులు లేవంటున్నారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం తమ పరిశీలనలో అవి ప్రభుత్వ భూములని తేలిందని తెలిపారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని.. కూల్చివేసిన తన ఆఫీసులో అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నాయంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేశంలో లేని సమయంలో హైడ్రా ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కాగా హైటెక్ సిటీకి చేరువలో వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన వసంత ప్రాజెక్ట్స్ ఇరవై ఏళ్ల కిందటి నుంచే విల్లాల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటికే 17 ఎకరాల్లో లగ్జరీ విల్లాలు నిర్మించి అమ్మేశారు. మిగిలిన 17 ఎకరాల్లో హైరైజ్ అపార్టుమెంట్లు నిర్మాణాలు చేపట్టారు. అయితే హఠాత్తుగా హైడ్రా రంగంలోకి దిగి అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చేసింది. ఆ 17 ఎకరాల స్థలం విలువ దాదాపు రూ.2వేల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.