ఖగోళం ఎన్నో అద్భుతాలకు నెలవు. మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఏప్రిల్ 25న ఆకాశంలో ‘స్మైలీ ఫేస్'(Smiley Face In The Sky) ఏర్పడనుందని సైన్స్ వెబ్‌సైట్ లైవ్‌సైన్స్ వెల్లడించింది. ఏప్రిల్ 25న తెల్లవారుజాముకు ముందు శుక్రుడు, శని, నెలవంక అతి సమీపంలోకి రానున్నాయి. దీంతో ఆ మూడు స్మైలీ ఫేస్ ఆకృతిని ప్రతిబింబించనున్నాయి. సూర్యోదయానికి ముందు అతికొద్ది సమయం మాత్రమే కనిపించనున్న ఈ దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడినుంచైనా వీక్షించేందుకు అవకాశం ఉంది. ఎగువన శుక్రుడు, కిందివైపు శని, ఇంకా కిందికి నెలవంక ఒక దగ్గరకు రానున్నాయి.
ఈ రెండు గ్రహాలు కళ్లుగా, నెలవంక చిరునవ్వుతో ఉన్న పెదాలుగా కనిపించనుంది. ఈ వివరాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోలార్ సిస్టమ్ అంబాసిడర్ బ్రెండా కల్‌బర్ట్సన్ తెలిపారు. అయితే స్మైల్ ఇమేజ్‌ను చూసేందుకు మాత్రం స్టార్‌గేజింగ్ బైనాక్యులర్, టెలిస్కోప్ అవసరం కానున్నాయి.