ప్రముఖ సంగీత రియాలిటీ షో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయకులు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచమయ్యారు. తాజాగా ఈ షోలో పాల్గొన్న గాయని ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya) న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గాయని సునీత, గీత రచయిత చంద్రబోస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేసింది.
‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రవస్తి ఆరోపించారు. ముఖ్యంగా కీరవాణి స్వరపరిచిన పాటలు పాడిన వారికే అధిక మార్కులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం కీరవాణి పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. అలాగే సెట్‌లో తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని ప్రవస్తి తెలిపారు. తన శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా బాధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చానని ఎప్పుడూ ఇలాంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోలేదని వాపోయారు.