టీమ్‌ఇండియా ప్రధాన కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. “నిన్ను చంపేస్తాం” అంటూ రెండు ఈ-మెయిల్స్ గంభీర్‌కు వచ్చాయి. ఈ మెయిల్స్ ఐసిస్ కశ్మీర్ పేరుతో పంపినట్లు గంభీర్ పేర్కొంటున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులను ఆయన ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తనతోపాటు కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ నెల 22న గంభీర్‌కు మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం రెండు మెయిల్స్ వచ్చాయి. రెండింట్లోనూ “I Kill U” అనే బెదిరింపు సందేశం ఉంది.
ఫిర్యాదుతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజింద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు అయ్యింది. గంభీర్‌కు బెదిరింపులు రావడం కొత్త కాదు. 2021లో ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఈ-మెయిల్ బెదిరింపులు ఎదురయ్యాయి. ఇక తాజాగా మంగళవారం కశ్మీర్‌లో పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో గంభీర్ పలు వేదికలపై ఉగ్రవాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతీకారంగానే ఈ బెదిరింపులు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం గంభీర్ భద్రత పెంచే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది.