తిరుమల శ్రీవారిపై పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాకి అపారమైన భక్తి ఉంది. ఏప్రిల్ 13వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడినందుకు.. కృతజ్ఞతగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడి ప్రాణాపాయాన్నుంచి తృటిలో తప్పకోవడంతో శ్రీవారిని దర్శించుకున్నారు.. అనంతరం హిందూ సంప్రదాయానికి అనుగుణంగా పూజలు నిర్వహించారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించడం, సుప్రభాత సేవల్లో పాల్గొనడం ద్వారా తన భక్తిని వ్యక్తపరిచారు.
తన మతాన్ని పక్కనబెట్టి హృదయపూర్వకంగా.. ఓ సాధారణ భక్తురాలిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు తిరుమలలో భక్తుల కోసం పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారి ఆలయానికి మొత్తం రూ.62 లక్షలు విరాళంగా అందించారు. ఇందులో అన్నప్రసాదం విభాగానికి మాత్రమే రూ.17 లక్షలు విరాళంగా ఇచ్చారు. మిగతా విరాళాన్ని మార్క్ శంకర్ పేరిట స్వామివారికి సమర్పించారు.
ఏప్రిల్ 8న సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. పొగతో నిండిన భవనంలో ఊపిరి ఆడక ఇబ్బంది పడిన మార్క్‌ను స్థానికులు కాపాడి.. ఆసుపత్రికి తరలించారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలతో చికిత్స పొందిన శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. దేశానికి తిరిగిన అనంతరం పవన్ కళ్యాణ్, తన కుమారుడికి మద్దతుగా నిలిచిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం సహా సంబంధిత అధికారులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటన సమయంలో ఆయన ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.. తన కుమారుడితో పాటు ఇతర చిన్నారులకు సహాయం చేసినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభ సమయంలో వారి కుటుంబానికి మద్దతుగా నిలిచినందుకు భారత ప్రభుత్వానికి, సింగపూర్ అధికారులకు పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా తమ కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన వార్త అభిమానుల్లో ఊరట కలిగించింది. సాధారణంగా తమ వ్యక్తిగత జీవితం గోప్యంగా ఉంచే పవన్ కుటుంబం, ఈ ఘటన ద్వారా మార్క్ శంకర్‌ను వార్తల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం సింగపూర్ అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.