తెలంగాణలో ఉన్న పాకిస్థానీయులకు(Pakistanis) డీజీపీ(DGP) జితేందర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు భారత్‌ను వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పాకిస్థానీయులకు వీసాలను కేంద్రం నిలిపివేసిందని, ఇప్పటికే వీసాలు పొందిన వారికి ఈనెల 27 వరకు గడువు ఉందని చెప్పారు. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి ఈనెల 29కు అనుమతి ఉందన్నారు. ఈనెల 30 వరకే వాఘా సరిహద్దు తెరిచి ఉంటుందని.. ఆలోగా తెలంగాణలో ఉన్న పాక్ పౌరులు వెళ్లిపోవాలన్నారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
కాగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఫోన్‌లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ దేశస్తుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. వెంటనే వారిని వెనక్కి పంపించే అంశంలో కేంద్రానికి సపోర్ట్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో దాదాపు 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించిన భద్రతా బలగాలు వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టాయి.