తిరుపతి జిల్లాలో ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటనపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“తిరుపతి జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల శ్రీ ఆర్.సిద్ధయ్య ఏనుగులు దాడిలో దుర్మరణం పాలవడం తీవ్ర బాధాకరం. ఆయన మృతికి సంతాపం వెల్లడిస్తూ కుటుంబ పెద్దను పోగొట్టుకున్న వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించడమైనది.
ఏనుగుల సంచారాన్ని, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. భవిష్యత్తులో ప్రజలకి వన్యప్రాణుల నుంచి, వన్య ప్రాణులకు ప్రజల నుంచి అవాంఛనీయ పరిస్థితులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ, శ్రీ సిద్ధయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.