తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మే 7వ తేదీన సమ్మెకు(RTC JAC Strike) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీసులు ఇచ్చామని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న తెలిపారు. అయినప్పటికి యాజమాన్యం చర్చలకు ఆహ్వానించకపోవడంతో సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు.
అయితే ఆర్టీసీ జేఏసీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్ భవన్ వద్ద భద్రతను పెంచారు. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన సంగతి తెలిసిందే. అయినా కానీ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధం అవుతున్న క్రమంలో ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.