భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్ధితులు మారిపోయాయి. సరిహద్దుల్లో పాక్ చురుగ్గా కుట్రలు పన్నినా… భారత్ కళ్లులా గమనిస్తోంది. డ్రోన్లు పంపినా, మిస్సైల్ దాడులకు యత్నించినాప్రతి కుట్రకు ముందుగానే చెక్ పెట్టి, సమర్థంగా ఎదుర్కొంటోంది. భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అద్భుతంగా స్పందించి పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను గాలిలోనే బుగ్గి చేసింది. ఇదే కాకుండా చైనా తయారు చేసిన HQ-9 డిఫెన్స్ వ్యవస్థను కూడా భారత్ నిర్వీర్యం చేసింది. తాజా సంఘటనల్లో భారత సైనిక శక్తిని మరోసారి రుజువు చేసింది.
పాక్ దాడులకు భారత్ సమాధానం: తాజాగా పాకిస్తాన్ నుంచి లాహోర్, సియాల్‌కోట్ మీదుగా వచ్చిన డ్రోన్లు, మిస్సైళ్లు భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించాయి. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి సహా 15 సైనిక స్థావరాలపై లక్ష్యంగా దాడికి పాక్ ప్రయత్నించింది. కానీ ఈ దాడులను భారత వాయుసేనకు చెందిన ఎస్-400 వ్యూహాత్మకంగా ఎదుర్కొని ఒక్కటైన ముప్పును దేశంలోని లోపలికి చొరగనివ్వలేదు.
పాక్ చైనా నుంచి దిగుమతి చేసుకున్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఎదుర్కొని, లాహోర్, సియాల్‌కోట్ తదితర నగరాల్లోని కీలక ప్రాంతాల్లో భారత డ్రోన్లు విజయవంతంగా దాడి చేసి HQ-9 వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాయి. ఇజ్రాయెల్ అందించిన ఆధునిక డ్రోన్లు ఈ దాడుల్లో కీలకంగా వ్యవహరించాయి. వీటి వేగం, ఖచ్చితత్వం HQ-9 వ్యవస్థకు సరిపోలలేదు. పాక్ వాయు రక్షణ వ్యవస్థలు దీంతో షాక్ అయ్యాయి.
S-400 సుదర్శనచక్రం ఏంటి:
‘సుదర్శన’ అనే పేరుతో భారత రక్షణ వ్యవస్థలో ప్రవేశించిన S-400 వాస్తవానికి రష్యా తయారీ అధునాతన దీర్ఘశ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ. ఇది 400 కి.మీ పరిధిలో ఏకకాలంలో ఫైటర్ జెట్లు, స్టెల్త్ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణుల్ని గుర్తించి నాశనం చేయగలదు. ఒక్కో స్క్వాడ్రన్‌లో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కో బ్యాటరీలో ఆరు లాంచర్లు, అధునాతన రాడార్ వ్యవస్థలుంటాయి. మొత్తం ఒక్క స్క్వాడ్రన్ 128 క్షిపణులను మోహరించగలదు. భారత్ ఇప్పటికే మూడు స్క్వాడ్రన్‌లను మోహరించగా, 2026 నాటికి మిగతా రెండు అందుబాటులోకి రానున్నాయి. ఈ మొత్తం ఒప్పందం విలువ రూ. 35,000 కోట్లు.
S-400 మోహరించడం ద్వారా భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. సాంప్రదాయ దాడులు, ఆధునిక టెక్నాలజీ ఆధారిత విమానాలపై సమర్థవంతంగా ఎదురుదాడి చేయగల S-400 ఇప్పుడు భారత వైమానిక దళానికి గేమ్‌చేంజర్‌గా మారింది. మొత్తానికి పాక్ మూర్ఖంగా చేసిన దాడికి, భారత్ తక్షణమే దిమ్మ తిరిగే గుణపాఠం చెప్పింది. S-400 సుదర్శనచక్రం వల్ల భారత్ ఎయిర్ డిఫెన్స్ లో భద్రమైంది మాత్రమే కాదు.. శత్రువులకు గట్టి హెచ్చరికగా నిలిచింది.