తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఐదు క్యాటగిరీల వారీగా బ్యాంకు రుణాలతోపాటు కొంతమొత్తం సబ్సిడీని కల్పిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,25,441 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనార్టీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనార్టీల నుంచి 2,689 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అయితే దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకర్లు లోన్ తిరస్కరిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్2 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ చూస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మొద్దని సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్, ట్రాక్ రికార్డు, రికవరీ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోరని పేర్కొన్నారు.