తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాలపై బుల్డోజర్లతో దాడి చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఏమైనా ఉందా అని నిలదీశారు. తాజాగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ పర్యటన నేపథ్యంలో అక్కడి పేదల ఇళ్లు కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమేనా ప్రజాపాలన అంటే అని మండిపడ్డారు. రాజభవనాలలో విలాసవంతమైన విందులు చేసి రూ. 200 కోట్లతో పాటు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి బుల్డోజర్లతో పేదల జీవితాలను నలిపివేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ అమానవీయ చర్యలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.