వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు నగరాల మేయర్ పదవులు కోల్పోయిన ఆ పార్టీ తాజాగా కడప మేయర్ స్థానాన్ని కూడా కోల్పోయింది. కడప మేయర్(Kadapa Mayor) సురేష్‌బాబుపై అనర్హత వేటు పడింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుంచి సురేష్‌బాబును తొలగిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు.
కాగా రూ.36లక్షలు అవినీతికి పాల్పడినట్టు సురేష్‌బాబుపై ఆరోపణలున్నాయి. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్.. నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన కాంట్రాక్ట్ సంస్థ ఎంఎస్ వర్దిని కన్‌స్ట్రక్షన్స్ ద్వారా చేయించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేశ్, భార్య జయశ్రీ ఉన్నారని గుర్తించారు. దీంతో పురపాలక చట్టం నిబంధనలు అతిక్రమించినట్లు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి విచారణ నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.