ఏపీ మద్యం కుంభకోణం కేసులో(Liquor Scam) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి(Govindappa Balaji) విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్ విధించింది. దీంతో గోవిందప్పను సిట్ అధికారులు విజయవాడ జైలుకు తరలించారు.
కాగా వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముడుపులు చేరవేయడంలో భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ క్రియాశీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్ బృందాలు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్ అటవీ ప్రాంతంలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తీసుకొచ్చి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
కాగా గోవిందప్ప మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారు. దీంతో ఈ కేసులో సంచలన పరిణామాలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా మాజీ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.