Wednesday, May 14, 2025
Homeఇంటర్నేషనల్భగవద్గీతపై చేయిపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన కెనడా మంత్రి.. ఎందుకంటే..?

భగవద్గీతపై చేయిపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన కెనడా మంత్రి.. ఎందుకంటే..?

ఇటీవల జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తన మంత్రివర్గాన్ని పునః వ్యవస్థీకరించారు. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌కు విదేశాంగ మంత్రిగా అవకాశం లభించింది. ఇప్పటికే రక్షణ, రవాణా వంటి కీలక శాఖల్లో పని చేసిన అనితా… ఇప్పుడు కెనడా విదేశాంగశాఖను నిర్వర్తించనున్నారు.

- Advertisement -

తాజాగా ఆమె భగవద్గీతపై చేయి వేసి ప్రమాణ స్వీకారం చేశారు. విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులైన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయమే కాదు, భారత్-కెనడా సంబంధాల పరంగా కూడా ఒక ముఖ్యమైన అభివృద్ధిగా భావిస్తున్నారు. 1967 మే 20న నోవా స్కోటియాలోని కెంట్‌విల్లేలో జన్మించిన అనితా ఆనంద్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమె తండ్రి తమిళ్, తల్లి పంజాబీ. వైద్య వృత్తిలో ఉన్న ఆమె తల్లిదండ్రులు 1960లలో కెనడాకు వలస వచ్చారు. అనితా డల్హౌసీ, టొరంటో, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆమె న్యాయశాస్త్ర నిపుణురాలిగా యేల్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో బోధించారు. ఆర్థిక నియంత్రణ, కార్పొరేట్ పాలన రంగాల్లో అనుభవం ఉన్న అనితా… రాజకీయాల్లోకి రాకముందే మంచి గుర్తింపు పొందారు.

ఆమె భర్త జాన్ నోల్టన్‌ ఒక న్యాయవాది, వ్యాపారవేత్త. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. 2019లో ఒంటారియో రాష్ట్రంలోని ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై, అదే ఏడాది జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. తొలుత ప్రజాసేవల మంత్రిగా, ఆ తర్వాత రక్షణ మంత్రిగా, తర్వాత ట్రెజరీ బోర్డు, రవాణా శాఖల్లో పనిచేశారు. రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో అనితా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ప్రకటించి, కెనడియన్ ఆర్మీలో సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్రూడో పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆమె పేరు కొత్త ప్రధానిగా బలంగా వినిపించినా, తాను ఆ పోటీలో లేనని స్వయంగా ప్రకటించారు.

ఇప్పుడు విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనితా ఆనంద్ నుంచి ప్రజలు, విశ్లేషకులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా భారత్-కెనడా సంబంధాల్లో బలోపేత చేయడానికి.. ఆమె కీలక పాత్ర పోషించే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News