భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. జమ్మూ కశ్మీర్లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడి తర్వాత భారత్ తక్షణమే గట్టి చర్యలు తీసుకుంది. 2025 ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఆ దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఏప్రిల్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో.. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ ఒక్కసారిగా తల దించుకుని భారత్‌ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తోంది. తమకు అత్యంత కీలకమైన సింధు నదీ జలాలను కాపాడుకునేందుకు భారత్‌తో మళ్లీ చర్చలు జరపాలని కోరుతోంది. పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా, భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసి.. ఒప్పందాన్ని రద్దు చేయకుండా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని విన్నవించారు. అయితే భారత్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్రశిబిరాలపై గాల్లో దాడులు నిర్వహించింది. నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ దాడులను భారత్ తిప్పికొట్టింది. అందేకాదు భారత్ దాడుల్లో పాకిస్తాన్ భారీగా నష్టపోయింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మే 13న మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా విరమించకపోతే సింధు జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అంతేకాదు ప్రధాని మోదీ కూడా సింధూ జలాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ఆయన పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది.
1960లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు జల ఒప్పందం ప్రకారం, భారత్‌కు కేవలం 30 శాతం నీరు మాత్రమే లభిస్తుండగా, మిగతా 70 శాతం పాకిస్తాన్ వినియోగిస్తోంది. ఇప్పుడు భారత్ తన వాటా మొత్తాన్ని వినియోగించుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాదు, వరదలపై పాకిస్తాన్‌కు ముందుగానే సమాచారం ఇవ్వడాన్ని కూడా నిలిపివేసింది. ఈ పరిణామాలతో పాకిస్తాన్లో, ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో నీటి కొరత తీవ్రమవుతుందనే ఆందోళన మొదలైంది. ఇటు పాక్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని భారత్ స్పష్టం చేస్తోంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలనే సంకల్పంతో ఈ దిశగా ముందుకు సాగుతోంది.