బంగాళాఖాతంలో ఏర్పాడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు(Rains) పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. అటు ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి.
మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అంచనా వేసిన సమయాని కంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. తొలుత ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేయగా.. అయితే మూడు రోజుల ముందే కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయి. దీంతో జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.