హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని సూచించారు.
“ముఖ్యమంత్రే హోం మంత్రిగా ఉన్నారు కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారు. ఎండాకాలం వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేదు. సిబ్బందికి సరైన మాస్కులు లేవు. హైదరాబాద్‌లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం. ఐదు లక్షల నష్టపరిహారం సరిపోదు. ఇంటికి, వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగింది. 125 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న అగర్వాల్ కుటుంబం మళ్లీ తమ వ్యాపారం ప్రారంభించుకోడానికి ప్రభుత్వం సహకరించాలి.
రూ. 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. బీఆర్ఎస్ తరపున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాము. రాజకీయం చేయడానికి రాలేదు. ఇలాంటి కడుపు కోత ఇంకెవరికి రాకూడదని వచ్చాను. ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని కోరుతున్నాను” అని కేటీఆర్ వెల్లడించారు. కాగా గుల్జార్ హౌజ్ వద్ద ఘోర అగ్నిప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
