భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీ నుంచి టీమిండియా వైదొలగాలని బీసీసీఐ(BCCI) నిర్ణయించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్థాన్ మంత్రి, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ స్పందించింది.
ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా ఐపీఎల్‌ను సజావుగా నిర్వహించడం మీదే ఉందన్నారు. ఆసియా కప్ విషయం లేదా మరేదైనా ఐసీసీ ఈవెంట్ గురించి ఏ స్థాయిలోనూ చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీడియాకు చెబుతామని వెల్లడించారు.