విశాఖ మహానగరపాలక సంస్థ (GVMC) డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 64వ డివిజన్‌కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్‌రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యుల కోరంతో సమావేశం నిర్వహించగా.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు.
సోమవారం కోరం లేక ఎన్నిక వాయిదాపడిన సంగతి తెలిసిందే. జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి కేటాయించడంతో అసంతృప్తికి గురైన ఇద్దరు టీడీపీ సభ్యులు సమావేశానికి హాజరు కాకపోవడంతో కొంత ఉత్కంఠ ఏర్పడింది. అయితే టీడీపీ పెద్దల ఆదేశాలతో అసంతృప్తులను బుజ్జగించడంతో ఈరోజు వారు సమావేశానికి హాజరయ్యారు. దీంతో కూటమి ప్రతిపాదించిన 64వ డివిజన్ కార్పొరేటర్ గోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాగా వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పదవి కోల్పోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉంటే ఇటీవల జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూడా కూటమి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మేయర్‌గా టీడీపీ నేత పీలా గోవింద్ ఎన్నికయ్యారు.