రేషన్(Ration) పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యానులు ఉండవని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మరో మంత్రి పార్థసారధితో కలిసి నాదెండ్ల మీడియాకు వెల్లడించారు. వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులు బియ్యం, ఇతర సరుకులు తీసుకోవాలని సూచించారు. 66 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ అవకాశం ఉంటుందని చెప్పారు.
29వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరకుల సరఫరా జరిగేదన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఎండీయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.1860 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. వందల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఈ వాహనాల ఆపరేటర్లపై నమోదయ్యాయని వివరించారు. 29వేల దుకాణాలకు 9వేల వాహనాలు సరిపోతాయా? అని ప్రశ్నించారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.27వేలు చొప్పున పౌరసరఫరాలశాఖ చెల్లిస్తోందన్నారు. అందుకే వీటి స్థానంలో జూన్ 1నుంచి రేషన్ షాపుల ద్వారానే సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. ఇకపై రేషన్ దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని నాదెండ్ల వెల్లడించారు.