రాష్ట్ర పోలీస్ అత్యుత్తమంగా శాంతి, భద్రతలు కాపాడుతూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోమ్ మంత్రి ఎం.డి. మహమూద్ అలీ అన్నారు. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, స్థానిక ఎమ్మేల్యే వెంకటరమణారెడ్డి, డి.జి.పి. అంజని కుమార్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి 10 కోట్లతో నిర్మించిన 4 పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు.
మొగుళపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం టేకుమట్లలో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను నేరుగా పలిమేల, కాళేశ్వరం పొలీస్ స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి అక్కడ నిర్వహించిన సభలో పాల్గొన్నారు.
700 కోట్లు ఖర్చు చేసి పోలీసులకు ఆధునిక పెట్రోలింగ్ వాహనాలు అందించారని, డయల్ 100 వ్యవస్థను పటిష్టం చేశారని హోంమంత్రి పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలో విశ్వాసాన్ని పెంపొందించామని, నూతన పోలీస్ నియామకాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని హోంమంత్రి తెలిపారు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక షీ టీమ్స్ లు అద్భుతమైన విజయాలు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచారని, అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్నారని హోంమంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవీష్ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.