TG Weather updates: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర పశ్చిమ తీర ప్రాంతంలో ఏర్పడ్డ తాజా అల్ప పీడన ద్రోణి కారణంగా పశ్చిమ, ఉత్తర, తూర్పు తీర ప్రాంత జిల్లాల్లో సాయంత్రం నుంచి అర్ధ రాత్రి వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షం సమయంలో బలమైన గాలులు వీస్తాయని తెలియజేసింది. ఈ ఈదురుగాలులు గంటకు సుమారు 40 నుంచి 55 కి.మీ. వేగంతో వీస్తాయని అంచనా వేసింది.
ఈ జిల్లాల్లో వర్షాలు:
వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి వంటి పశ్చిమ తీరప్రాంతంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాలైన ఈశాన్య తీరప్రాంతంల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.- హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
గడిచిన 24 గంటల్లో:
గడిచిన 24 గంటల్లో మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం వంటి ఈశాన్య ప్రాంతాల్లో గత 12 గంటల్లో ఆశించిన స్థాయిలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నేడు నిన్నటిలాగే అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కొనసాగుతాయని పేర్కొంది. మధ్య భారతదేశంలో అల్పపీడనం బల పడటం వలన ఈరోజు నుంచి తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ముందుగానే తెలిపింది.