Sunday, November 24, 2024
Homeఫీచర్స్Perfumes: పర్ఫ్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవటం ఎలా ?

Perfumes: పర్ఫ్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవటం ఎలా ?

పెర్ఫ్యూమ్స్ కొనే ముందు ఈ విషయాలు మరవొద్దంటున్నారు సౌందర్య నిపుణులు. అవేమిటంటే..

- Advertisement -

 పెర్ఫ్యూమ్ గాఢతను బట్టి అది చర్మాన్ని ఎంత ఎక్కువ సమయం అంటిపెట్టుకుని ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది.

 గాఢతకనుగుణంగా సెంట్స్ లో విభిన్నమైన కేటగిరిలో ఉన్నాయి. ఉదాహరణకు ప్యూర్ పెర్ఫ్యూమ్ అని ఉంటుంది. దీని సువాసనా గాఢత 20 నుంచి 30 శాతం దాకా ఉంటుంది. దీని సుగంధం శరీరంపై ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ ఉంటుంది. ఈ రకమైన పర్ఫ్యూమ్స్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.

 ‘ఈ దే ’పార్ఫ్యూమ్ గాఢత 15 నుంచి 20 శాతం దాకా ఉంటుంది. దీన్ని శరీరంపై స్ప్రే చేసుకుంటే ఐదు గంటల పాటు దాని సువాసన చర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. మనకు లభ్యమయ్యే రకరకాల సెంట్ బ్రాండుల్లో ఇంత శాతం గాఢతే ఉంటుంది. వీటి ఖరీదు ప్యూర్ పార్ఫ్యూమ్ కన్నా తక్కువ ఉంటుంది. ఈ గాఢత గల పెర్ఫ్యూమ్స్ ను సాయంత్రాల సమయాల్లో, అలాగే స్పెషల్ అకేషన్లలో వేసుకుని వెడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

 ‘ఈ దే టాయిలెటె’ (ఈడిటి) పెర్ఫ్యూమ్ లో సాధారణ గాఢత ఉంటుంది. నిత్యం ఈ సెంటును వాడొచ్చు. దీని గాఢత ఐదు నుంచి పదిహేను శాతం ఉంటుంది. శరీరంపై దీని సువాసన రెండు మూడు గంటల పాటు ఉంటుంది. దీని ఖరీదు ఎక్కువ ఉండదు.

 ‘ఈ దే కొలోగ్నే’ పర్ఫ్యూమ్ గాఢత రెండు శాతం నుంచి నాలుగు శాతం మేర ఉంటుంది. శరీరంపై దీని సువాసన రెండు గంటల పాటు ఉంటుంది.

 ఇకపోతే బాడీ మిస్ట్స్, ఆఫ్టర్ షేవ్స్ల లలో చాలా తక్కువ ప్రమాణంలో గాఢత ఉంటుంది. కాబట్టి కొద్ది సమయం మటుకే వీటి సువాసన చర్మంపై ఉంటుంది. జిమ్ సెషన్ అయిన తర్వాత గాని, లేదా కొద్దిసేపు బయటకు వెళ్లాల్సి వచ్చినపుడు శరీరంపై దీన్ని స్ప్రే చేసుకోవచ్చు.

 మీరు కొనే ఏ పెర్ఫ్యూమ్ పైనైనా మూడురకాల నోట్స్ ఉంటాయి. ఒకటి టాప్ నోట్స్, రెండవది మిడిల్ నోట్స్, మూడవది బేస్ నోట్స్. ఈ మూడింటి సమ్మేళనంతో కూడిన పెర్ఫ్యూమ్స్ విలక్షణమైన సువాసనను వెదజల్లుతాయి. వీటితోపాటు ఇంకా రకరకాల నోట్స్ ఉన్నాయి. వీటి సమ్మేళనాలతో మధుర సువాసనలు గల పెర్ఫ్యూమ్స్ రూపొందిస్తారు.

 వీటి సువాసనల్లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి సిట్రసెస్. ఇవి సువాసనల నిధి. వీటిని నిమ్మ, కమలాపండు, ఇతర రకాల పండ్ల తో తయారుచేస్తారు. వేసవిలో ఈ పెర్ఫ్యూమ్స్ వాడితే బాగుంటుంది.

 ఫ్లోరల్ ఫ్రాగ్రెన్సెలు కూడా ఉన్నాయి. వీటికి రొమాటిక్ ఫ్రాగ్రెన్సెలని పేరు. ఇవి శరీరంపై స్వీట్, లైట్ సువాసనలను చిందిస్తాయి. గులాబి, లిల్లీ, లవండర్, మల్లెల సువాసనల మిశ్రమంతో వీటిని తయారుచేస్తారు. పురుషులు ఉపయోగించే చాలా సెంట్లలో ఆరంజ్ సువాసన ఉంటుంది.

 వార్మ్ గా , సెన్సువల్ గా ఉండే సువాసనలు చిందించే ఫ్రాగ్రెన్సు లను దాల్చినచెక్క, లవంగాలు, వెనీలాలతో చేస్తారు. ఈ పెర్ఫ్యూమ్స్ సుగంధం శరీరంపై ఎక్కువసేపు ఉంటుంది.

 ఉడీనోట్స్ ని పురుషులు బాగా ఇష్టపడతారు. ఇందులో లైట్ టాప్ నోట్ తో పాటు మస్కీ మిడిల్ నోట్ ఉంటుంది. ఈ నోట్స్ ను శాండల్ వుడ్, ఓక్, పచౌలీ నుంచి తయారుచేస్తారు. దీని సువాసన ఎంతో అధునాతనంగా ఉంటుంది. స్త్రీలు సాయంత్రాల సమయంలో వుడీ నోట్స్ ను వాడితే ఎంతో బాగుంటుంది.

 పర్ఫ్యూమ్ ను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ సువాసన మిమ్మల్ని ఎక్కువ ఆకర్షిస్తోందో గమనించుకోవాలి. దాని ఉపయోగం ఎంతవరకూ ఉందో గమనించుకోవాలి.

 సిట్రస్ లేదా ఫ్లోరల్ నోట్స్ ను పగటి సమయంలో వాడొచ్చు. ఉడీ, ఓరియంటల్ నోట్స్ సెంట్స్ ను డేటింగ్ అప్పుడు, సాయంత్ర సమావేశాలప్పుడు వాడితే బాగుంటుంది.

 పెర్ఫ్యూమ్ వాసన మరింత ఎక్కువ సేపు శరీరం మీద ఉండాలంటే కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. పెర్ఫ్యూమ్ వేసుకునే ప్రదేశంలో పెట్రోల్ జెల్లీ అప్లై చేసుకోవాలి. పెట్రోల్ జెల్లీ చర్మానికి అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి పెర్ఫ్యూమ్ ఎక్కువ సేపు సువాసనలు వెదజల్లుతుంది.

 స్నానం చేసిన వెంటనే పెర్ఫ్యూమ్ వేసుకుంటే కూడా ఎక్కువ సేపు దాని సుగంధం శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. చర్మపై ఉండే రంధ్రాల వల్ల, చర్మంకున్న వెచ్చదనం వల్ల సువాసనలను శరీరం గ్రహించడమే ఇందుకు కారణం .

 సెంటు చల్లుకున్న ప్రదేశాన్ని కొన్ని గంటల తర్వాత గట్టిగా రుద్దితే పెర్ఫ్యూమ్ తిరిగి సువాసనలను చిందిస్తుంది.

 పెర్ఫ్యూమ్ ను పల్స్ పాయింట్స్ దగ్గర అంటే బొడ్డు, మణికట్టు, కాలర్ బోన్స్ దగ్గర స్ప్రే చేస్తే ఎక్కువ సమయం దాని సువాసన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది.

 ఎండవేడి, సూర్యకాంతి ఉన్న చోట పెర్ఫ్యూమ్స్ ఉంచడం వల్ల అందులో కలిపిన పదార్థాలు దెబ్బతింటాయి. అందుకే పెర్ఫ్యూమ్ బాటిల్స్ ను చల్లగా ఉన్న పొడి ప్రదేశంలోనే భద్రపరచాలి. పెర్ఫ్యూమ్ ‘షెల్ఫ్ లైఫ్’ మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుంది.

 భారతదేశంలో వాడే పెర్ఫ్యూమ్స్ల్ లో ఎక్కువగా సహజసిద్ధమైన పదార్థాలను అంటే శాండల్ వుడ్, జాస్మిన్, రోజ్, కుంకుమపువ్వు వంటి వాటినే వాడతారు. భారత పెర్ఫ్యూమ్స్ ఎంతో గాఢత కలిగి ఉండి చిన్న బాటిల్స్ లేదా వాయిల్స్ లో లభిస్తాయి. వీటిని చాలా తక్కువ పరిమాణంలోనే వాడతారు. మన దేశంలో దొరుకే ప్రసిద్ధిచెందిన పెర్ఫ్యూమ్స్ బ్రాండ్స్ లో జె.ఫ్రాగ్రెన్సెస్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్, కామ ఆయుర్వేద వంటివి కొన్ని ముఖ్యమైనవి.

ఇటీవల కాలంలో సింథటిక్ పెర్ఫ్యూమ్స్ కూడా భారత్ లో వాడకంలోకి వచ్చాయి. అలాగే పలు అంతర్జాతీయ పెర్ఫ్యూమ్స్ కూడా మార్కెట్లల్లో దొరుకుతున్నాయి. పెర్ఫ్యూమ్స్ లో వాడిన పదార్థాల నాణ్యత, బ్రాండును బట్టి వాటి ఖరీదు ఉంటాయి. కొన్ని హైఎండ్ పెర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. వీటి ఖరీదు ఎక్కువే. మిగతా పెర్ఫ్యూమ్స్ అందుబాటు ధరలో లభిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News