జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం ఇప్పటం గ్రామస్తులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జనసేనాని మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ విమర్శలపై సెటైర్లు వేస్తూ వరుస ట్వీట్లు చేశారు. “ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడుతుంది.. పవన్ బాబు కూడా అంతే” అని విమర్శించారు. కొద్దిసేపటికి.. “నువ్వు రంకెలేసినా.. బాబుతో కలిసొచ్చినా.. జగన్మోహన్ రెడ్డి గారి ఎడమకాలి చిటికెన వేలు మీద ఈక కూడా ఊడదు” అని ట్వీట్ చేశారు. అంబటి చేసిన ఈ ట్వీట్లపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీకు ఓట్లేసి గెలిపించింది.. ఇక్కడ ట్వీట్లు వేసుకుంటూ కూర్చోడానికి కాదని ఒక నెటిజన్ అంటే.. “నువ్వు ఎంత రంకెలేసినా 2024లో ఓడిపోవడం ఖాయమని ఇంకోక నెటిజన్” కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ సీఎం అయ్యాక.. మీ అవినీతి సొమ్మునంతా బయటికి లాగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మరో నెటిజన్ అన్నారు. ఇలా అంబటి రాంబాబు ట్వీట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
ఇప్పటం గ్రామంలో పవన్ మాట్లాడుతున్న వీడియోని జనసేన ట్వీట్ చేసింది. ఏపీ ప్రభుత్వ పథకాలన్నింటినీ.. ఆ నాయకుడి పేరు మీద పెద్దన్న పథకం, చిన్నన్న పథకం అని పథకాలు తెస్తుంటారని పరోక్ష విమర్శలు చేశారు. అలాగే సీఎం జగన్ ప్రతి విషయానికి నవ్వుతుండటంపై ఆయన పేరు ప్రస్తావించకుండానే..పరోక్షంగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకుడి నవ్వులకు అసలు లోటు ఉండదని, సమయం సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడని ఎద్దేవా చేశారు.
“నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు… ఆ విషయం అతనికి తెలియదనుకుంటా. ఎవరన్నా చనిపోయినప్పుడు ఏడుస్తుంటే.. ఏంటి ఏడుస్తున్నారా, చనిపోయారా అని కూడా నవ్వుతూనే అడుగుతాడు. ఏంటి ఆస్తులు పోయాయా.. ఎంత పోయాయి.. రూ.10 కోట్లు పోయాయా అని కూడా నవ్వుతూనే అడుగుతాడు. గడపలు కూల్చేశారా… అంటూ అది కూడా నవ్వుతూనే అడుగుతాడు. అలా అడగకూడదండీ… అది తప్పు. ఎదుటివాళ్లు బాధలో ఉన్నప్పుడు కనీసం నటించడమైనా నేర్చుకోండి” అని పవన్ కల్యాణ్ సలహా ఇచ్చారు.