సాఫ్ట్ వేర్, మల్టీ నేషనల్ కంపెనీల్లో వారానికి ఐదురోజులు పనిదినాలు ఉంటాయని తెలిసిన విషయమే. కానీ ఓ వంద కంపెనీలు వాటిని నాలుగురోజులకు కుదిస్తూ.. తమ ఉద్యోగులకు శుభవార్తను అందించాయి. ఎక్కడ అనుకుంటున్నారా ? ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న యూకే (యునైటెడ్ కింగ్ డమ్)లో. వారానికి నాలుగు రోజులు పనిచేస్తే చాలని తమ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చాయి. జీతంలో ఎలాంటి కోత లేకుండా.. నాలుగురోజుల్లో పనిగంటల్ని పెంచకుండా నాలుగు రోజులు పనిచేస్తే చాలని 100 కంపెనీలు ప్రకటించాయి.
నాలుగురోజులు పనిదినాల వల్ల ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారని, కంపెనీలోని ఉత్పాదకతలో మార్పులుండవని తెలిపాయి. వాటిలో రెండు ప్రముఖ కంపెనీలూ ఉన్నాయని ‘ది గార్డియన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్. ఒక్కో కంపెనీలో సుమారు 450 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. పనిదినాలు తగ్గించిన తర్వాత.. ఉద్యోగులపై ఐదు రోజుల పనిగంటలను కుదించి నాలుగు రోజులకు సర్దుబాటు చేయలేదని అవిన్ సీఈవో ఆడమ్ రాస్ వెల్లడించారు.
అలాగే కంపెనీ ఉత్పాదకత కూడా తగ్గలేదని తమ ఉద్యోగులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇలా పనిదినాలను తగ్గించడం వల్ల ఉద్యోగుల వలసలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.