Sanju Samson : ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం. దాన్ని నిరూపించుకునేందుకు అవకాశాలు ఇవ్వాలి కదా. అప్పుడే అతడు జట్టులో సుస్థిర స్థానాన్నిసంపాదించుకోగలడు. సంజుశాంసన్ విషయంలో ఇదే జరుగుతోంది. సిరీస్‌లకు ఎంపిక చేస్తున్నారు తప్పించి తుది జట్టులో చోటు ఇవ్వడం లేదు. ఎప్పుడో ఒక సారి తుది జట్టులో చోటు ఇచ్చినా మరుసటి మ్యాచ్‌కు జట్టు నుంచి తప్పిస్తున్నారు. ఇటీవల ముగిసిన కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తొలి వన్డేలో సంజును ఆడించగా 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే.. రెండో వన్డేకు వెంటనే పక్కకు తప్పించారు.
ఎన్ని అవకాశాలు ఇచ్చినా రిషబ్‌పంత్ వరుసగా విఫలం అవుతున్నాడు. రిషబ్ తో పోలిస్తే సంజు చాలా బెటర్‌గా కనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్ దీపక్ హుడా కోసం రెండో వన్డేలో సంజును తప్పించినట్లు చెబుతున్నప్పటికీ దక్షిణాది ఆటగాడు అనే వివక్షే కారణం అని అతడి అభిమానులు అంటున్నారు. కనీసం రేపు(బుధవారం) జరిగే మూడో వన్డేలోనైనా సంజుకు చోటు ఇస్తారో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే.. ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ 2022 మ్యాచ్‌లు జరగుతున్నాయి. ఈ మ్యాచుల్లో సంజు బ్యానర్లు వైరల్‌గా మారుతున్నాయి. ఈ మ్యాచులకు హాజరవుతున్న సంజు అభిమానులు “నిన్ను టీమ్ఇండియా ఆడించినా, ఆడించకపోయినా మేం నీతోనే ఉంటాం” అంటూ అతడికి మద్దతుగా బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. ఈ ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.