IND vs NZ 3rd ODI : మూడు వన్డేల సిరీస్ ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందీర్ (51; 64 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్), శ్రేయస్ అయ్యర్(49; 59 బంతుల్లో 8ఫోర్లు) మినహా మిగిలిన వారంతా విఫలం కావడంతో టీమ్ఇండియా 47.3 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థి ముందు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. వాతావరణం, పిచ్.. బౌలింగ్‌కు సహకరిస్తుండడంతో సౌథీ, మిల్నెల, హారీలతో కూడి బౌలింగ్ త్రయం భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఓపెనర్లు ధావన్(28), గిల్(13) తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. రిషబ్ పంత్(10), సూర్యకుమార్ యాదవ్(6), దీపక్ హుడా(12)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇన్నింగ్స్ మధ్యలో శ్రేయస్ అయ్యర్, ఆఖర్లో వాషింగ్టన్ సుందర్‌లు రాణించడంతో టీమ్ఇండియా 200 మార్క్‌ను దాటింది. కివీస్ బౌలర్లలో మిచెల్, మిల్నేలు చెరో మూడు వికెట్లు తీయగా, సౌథీ రెండు, ఫెర్గూసన్, శాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే బౌలర్లు శ్రమించాల్సిందే.