Celebrations erupt in Iran : ఆట ఏదైనా కానివ్వండి. తమ జట్టు గెలవకుంటే అభిమానులు నిరాశ చెందుతారు. అయితే.. ఇందుకు భిన్నంగా ఓ దేశ అభిమానులు ప్రవర్తించారు. తమ జట్టు ఓడిపోవడంతో వందలాది మంది అభిమానులు వీధులోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. వారు ఎవరు అని అంటారా..? ఇరాన్ దేశ వాసులు.
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022 మ్యాచులు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. మంగళవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ 1-0 తేడాతో ఓటమిపాలైంది. అయితే.. తమ జట్టు ప్రపంచకప్‌లో ఓడిపోవడంతో ఇరాన్ వాసులు పండుగ చేసుకున్నారు. వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ సిటీ కామ్యారన్‌లో ఉత్సాహంతో డ్యాన్సులు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇరాన్ అభిమానులు ఇలా వేడుకలు చేసుకునేందుకు ఓకారణం ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశంలో గత కొంత కాలంగా జరుగుతున్న హిజాబ్ ఆందోళనలే. ఈ ఆందోళనల్లో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలా దేశంలో యాంటీ హిజాబ్ ఆందోళనలు జరుగుతుంటే ఫిఫా ప్రపంచకప్ కోసం ఇరాన్ జట్టు ఖతార్ వెళ్లడం అవసరమా అని అక్కడి ప్రజల అభిప్రాయం. ఈ కారణంనే తమ జట్టు ఓడిపోవడంతో వీధుల్లోకి వచ్చి చిందులు వేశారు.