Rishabh Pant : గత కొంతకాలంగా టీమ్ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అయినప్పటికీ అతడికి తుది జట్టులో అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కివీస్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో సైతం 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అయితే.. అతడు వెన్నుగాయంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌లో ఔటై పెవిలియన్‌కు చేరిన తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు స్ట్రెచ్చర్‌పై పడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంత్ గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. పంత్ గాయం మరీ పెద్దదైతే డిసెంబర్ 4 నుంచి మొదలుకానున్న బంగ్లాదేశ్ టూర్‌కు పంత్ వెళ్లేది అనుమానమే.
పంత్ బ్యాటింగ్ వైఫల్యంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 10, 15, 125, 0, 56, 18 పరుగులు చేశాడు. 2022 సంవత్సరంలో 12 వన్డేలు ఆడిన పంత్ 223 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ స్థానంలో సంజుకి అవకాశాలు ఇవ్వాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేయాలని అంటున్నారు. ఇక వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా మరో 21 వన్డేలు మాత్రమే ఆడనుంది.