ఆధ్యాత్మిక పర్యాటకానికి భారత్ దర్శన్ యాత్ర ప్రోత్సాహకరంగా ఉందని బిజెపి మహంకాళి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల మహేశ్ కుమార్ అన్నారు. నగరం నుంచి సుమారు 400ల మంది పర్యాటకులు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ మహకాళేశ్వర్ మందిర్ కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వారికి ఘన స్వాగతం పలికారన్నారు. వారిలో తాము కూడా ఉన్నామని మహేశ్ పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఉజ్జయిన్ వరకు సాగిన తమ ప్రయాణంలో తామెళ్లిన ప్రతి రాష్ట్రంలో బిజెపి ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారన్నారు. వారి అతిథ్యాన్ని స్వీకరించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను చూపించడం జరిగిందన్నారు.
ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ నినాదంతో సాగిన తమ ప్రయాణంలో మధ్య ప్రదేశ్ పర్యాటక రంగంలో ఉన్న ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిందన్నారు. మహాకాళేశ్వరుడితో పాటు మహంకాళి దర్శనంతో మనసు పులకించిందన్నారు. ఇటువంటి యాత్రలు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయని, అంతేకాకుండా ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి కల్పిస్తున్న ప్రాధాన్యం యాత్రలో పాల్గొన్న ప్రతిఒక్కరికి సాక్షాత్కరించిందని వివరించారు. ఈకార్యక్రమంలో తమతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు, పర్యాటకులు ఉన్నారని వెల్లడించారు.