జోయా పుట్టింది అబ్బాయిగా. అంతర్గతంగా అమ్మాయి మనసు తనది. పదకొండేళ్లకే తను అందరి పిల్లల్లాంటిది కాదని గ్రహించింది. పద్ధెనిమిదేళ్లకు తను ట్రాన్స్ జండర్ అని గుర్తించింది. ట్రైన్లలో బిచ్చమెత్తింది. బిచ్చమెత్తిన చేతులతోనే కెమెరా పట్టి భారతదేశ తొలి ట్రాన్స్ జండర్ ఫోటోజర్నలిస్టుగా పేరుతెచ్చుకుంది. జోయా జీవితమంతా ఆటుపోటులే..కానీ అది జోయా ఫోటోగ్రఫీ కలను కరగిపోనివ్వలేదు. తన ఫోటోలతో కోవిడ్ పాండమిక్ లో వలసకార్మికుల బతుకు వ్యథలను ప్రపంచానికి చాటి మన తొలి ట్రాన్స్ జండర్ ఫోటోజర్నలిస్టుగా ప్రపంచం ముంగిట నిలిచింది…
భారతదేశ తొలి ట్రాన్స్ జండర్ ఫోటోజర్నలిస్ట్ జోయా థామస్ లోబో. ఆ విజయహాసంతో నిలబడడానికి జోయా తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు ఎన్నో. ఇందుకోసం సమాజం స్రుష్టించిన ఎన్నో అడ్డంకులను సైతం ధైర్యంగా ఎదిరించి నిలబడి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఈ క్రమంలో ఆమె చేసిన జీవన ప్రయాణం ఒక రెబల్ ను తలపిస్తుంది. ఫ్రీలాన్స్ ఫోటోజర్నలిస్టుగా జోయా ప్రయాణం నిజంగా ఎందరినో అబ్బురపరుస్తుంది. కోవిడ్ వ్యాప్తితో 2020లో జనతా కర్ఫ్యూ విధించడం అందరికీ గుర్తే. సరిగ్గా దానికి ఒకరోజు ముందు బాంద్రా స్టేషన్ ముందు బాధాతప్త హ్రుదయాలతో, మోములతోనిలబడి నిరసన ప్రదర్శనలను చేస్తున్న వలససకార్మికులను తన కెమెరాలో జోయా బంధించింది. ఆమె తీసిన ఫోటోలు జాతీయ,అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అది ఆమెకు అద్భుత అనుభవం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఒక ఫోటోజర్నలిస్టుగా గుర్తింపు కోసం జోయా చేస్తున్న పోరాటం ఫలవంతమైన అద్భుత క్షణాలు అవి. జోయా గత జీవితం తెలిసిన వారికి ఈ విజయం ఆమెకు ఎంత అసాధారణమైందో అర్థమవుతుంది. ట్రాన్స్ జండరయిన జోయా దశాబ్దకాలం పాటు ముంబయి ట్రైన్లలో బిచ్చమెత్తింది. ఆ దశ నుంచి జోయా ఒక ఫోటోజర్నలిస్టుగా ఎదగడం ఎంత గొప్ప విజయమో ఇప్పుడు చాలామందికి అర్థమయే ఉంటుంది. జోయా తన మనసు లోలోపలి పొరల్లో దాగిన కలను నిజం చేసుకుంది. ఆమె తీసిన వలసకార్మికుల ఫోటోలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల అన్నింటిలో నేటికీ కనిపిస్తాయి.
కన్న కలను సాకారం చేసుకోగలమన్న ఒక అపూర్వ వాస్తవానికి నిలువెత్తు నిదర్శనం జోయా. కానీ ఆమె జీవితంలో చీకటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఫుట్ పాతులమీద పడుకున్న రోజులు ఎన్నో. మహారాష్ట్రలోని అండర్ బ్రిడ్జిల కింద నిద్రపోయిన రోజులు ఎన్నో. బతకడానికి, తలదాచుకోవడానికి ఒక ఇల్లంటూ లేకుండా వీధులనే ఇల్లు చేసుకుని బతికిన రోజులు ఎన్నో. అర్థరాత్రుళ్లు నిద్రలో కళ్లు తెరిచిన క్షణంలో తనను కళ్లప్పగించి భయంకరంగా చూస్తున్న పురుషులను చూసి జోయా వణికిపోయిన ఘటనలు ఎన్నో. పూట గడవడం కోసం అలంకరణల పని చేసేది. కొన్నాళ్లు నర్సరీలో పనిచేసింది. అలా ఒక్కొక్క అడుగు మెల్లగా వేస్తూ చివరకు ఫోటో జర్నలిస్టు అయ్యే దిశగా ఆమె ప్రయాణం సాగింది.
జోయా ఐదవ క్లాసు వరకూ కాన్వెంటులో చదివింది. తర్వాత చదువు మానేసింది. జోయా బాల్యం మహిమె భాతియా వారి ఎ బ్రదర్స్ కోఆపరేటివ్ సొసైటీలో గడిచింది. అక్కడే జోయా తండ్రి వాచ్ మెన్ గా పనిచేసేవారు. క్రిస్టియన్ కమ్యూనిటీ మధ్యన జోయా పెరిగి పెద్దదైంది. అనారోగ్యకారణాలతో జోయా తండ్రి హఠాత్తుగా చనిపోయారు. వారుంటున్న అపార్ట్ మెంట్ రెంట్ వివాదం కారణంగా జోయా కుటుంబం దాన్ని వదిలివెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు జోయా తల్లి సోదరి దగ్గరకు వారి కుటుంబం చేరుకుంది. తల్లి, సోదరితో కలిసి మహీ వెస్ట్ లో చాలాకాలం జోయా జీవించింది. జోయా తల్లి తన ఇద్దరి పిల్లల్ని పెంచలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై చివరకు తాగుడుకు బానిసయింది. జోయాకు డాన్ బో స్కూల్ లో ప్రవేశం లభించింది. చదువుకుంటూనే కుటుంబ పోషణ కోసం దగ్గరలోనే ఉన్న ఒక బేకరీలో జోయా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం ప్రారంభించింది. చర్చి నుంచి నెల రేషన్ వారి కుటుంబానికి అందేది. సరిగ్గా అదే సమయంలోనే జోయాకు తాను మిగతా పిల్లలకంటే డిఫరెంట్ అనే విషయం అర్థమవుతూ వచ్చింది. తాను భౌతికంగా మగాడు. కానీ అంతర్గతంగా తన ప్రవర్తన, ఆలోచనలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కానీ ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడానికి చాలా భయపడింది. ఒకవేళ చెపితే తనను వదిలేస్తారని జోయా భయపడింది. తనకు ఆప్తులైన కొందరు స్నేహితులకు మాత్రం చెప్పింది. కానీ వాళ్లు ఆ తర్వాత నుంచి తనకు దూరంగా ఉండడం మొదలెట్టారు. తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చేయాలనే ఆలోచన కూడా జోయా చేసింది . కానీ తన అక్క పెళ్లి ఉండడంతో తన గురించిన నిజం తెలిస్తే తన అక్క జీవితానికి సమస్య వస్తుందని తన గురించిన నిజం చెప్పకుండా వెనకడుగేసింది. మొత్తానికి ఐదారేళ్ల తర్వాత అంటే జోయాకు 18 ఏళ్లు వచ్చినపుడు తన విషయాన్ని ఇంట్లో చెప్పింది. మెల్లగా ఆ ప్రాంతంలోని తనలాంటి కొందరితో జోయాకు స్నేహం అయింది. వారి కంపెనీ జోయాకు ఎంతో కంఫర్టును ఇచ్చేది. అదే సమయంలో తన ఆంటీ ఇంటిని వదిలి జోయా కుటుంబం రైల్వే స్టేషన్లలో బతకడం ప్రారంభించింది. కానీ అక్కడ సామాన్య జనాల నుంచి వాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. రోజు గడవడం కోసం ముంబయి గ్రాంట్ రోడ్ లో నర్సరీల్లో, సినిమా హాళ్లల్లో టికెట్లు అమ్మడం, ఊడ్చడం వంటి పనులను జోయా చేయడం మొదలెట్టింది. ఒకరోజు జోయా చదివిన స్కూలు టీచరు జోయా చేస్తున్న పనులు చూసి అవి చేయద్దని తనతో తీసుకువెళ్లాడు. తన డాన్సు స్కూల్ లో జోయాకు రిసెప్షనిస్టుగా పని ఇచ్చాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ డాన్సు స్కూలు మూతబడింది. ఈ క్రమంలో తల్లికి తన ఐడెంటిటీ గురించి చెప్పింది. తను ట్రైన్స్ లో భిక్షమెత్తుతానని, ఎలాంటి తప్పు పనులు చేయనని జోయా తల్లిని సముదాయించింది కూడా.
జోయా (లోబో) తన ‘గురు’ ను గుర్తించింది. ఆ గురునే సల్మా. జోయా ట్రాన్స్ జండర్ పర్సన్ అని సల్మా గుర్తించింది. ట్రాన్స్ జండర్ గ్రూపుకు జోయాను సల్మా పరిచయం చేసింది. అంతా కలిసి లోబోకు సీమా అనే పేరు పెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత లోబో ఆ పేరుకు బదులు జోయా అని పెట్టుకుంది. 27 ఏళ్ల జోయా ఒక గదికి కావలసిన రెంటును సమకూర్చుకుని తన కుటుంబాన్ని ఫుట్ సాత్ ల నుంచి ఛిన్న ఇంటికి మారి కొత్త జీవితం మొదలెట్టింది. జోయా మనసులో మాత్రం సంగీతం అన్నా, ఫోటోగ్రఫీ అన్నా ఎంతో ఇష్టం ఉండేది. వయొలిన్ కొనుక్కుందామని షాపుకు వెళ్లి అక్కడ షాపు వాళ్ల ఛీత్కారాన్ని చవిచూసింది. నిరాశతో వెనక్కి వస్తున్న సమయంలోనే ఒక కెమెరా షాపు చూడడం అందులో సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం జరిగింది. అలా కెమెరా కొనుక్కుంది కానీ దాని గురించి ఏమీ తెలియదు. అలా పోటోగ్రఫీ వైపు ఆమె దారి మళ్లింది. ఫోటోగ్రఫీ కూడా నేర్చుకోవాలనే కల ఉండేది కానీ ఎన్నడూ ఎవరి ముందూ తన కలను వ్యక్తంచేయలేదు. ఇది సాధ్యమయ్యే కల కాదని జోయా భావించడమే ఇందుకు కారణం.
ఎంతో కష్టపడి జోయా సంపాదించిన డబ్బులను తల్లి మిగలనివ్వకుండా తన తాగుడుకు వాడేసేది. దీంతో ఆ కుటుంబం మళ్లా వీధిన పడింది. ముంబయి ప్రెస్ క్లబ్ ఏరియాకు చేరుకుంది. పోలీసులు వారిని వెంటాడుతుండడంతో తరచూ రకరకాల ప్రదేశాలను మారుతూ ఉండాల్సి వచ్చేదని జోయా చెప్పింది. తన ‘గురు’ బ్రుందం చేతిలో జోయా తరచూ చిత్రహింసలకు గురయ్యేది. వాటిని భరించలేక చివరకు ఆ కమ్యూనిటీని జోయా విడిచింది. సరిగ్గా అప్పుడే అంటే 2016లో జోయా తల్లి చనిపోయింది. ఆ తర్వాత కూడా రకరకాలైన అమానుషమైన హింసాత్మక చర్యలకు జోయా గురైంది. ఒకసారి ముంబయిలో సాయంత్రం ఒక అబ్బాయితో కలిసి రైలు ప్రయాణం చేస్తుండగా సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు ఒకరు జోయాను తీవ్ర హింసకు లోనుచేశాడు. ఆ పోలీసు జోయాను గ్రాంట్ రోడ్ చౌకికి తీసుకెళ్లి బట్టలు ఉప్పదీసి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా హింసించాడు. జోయాను, ఆ అబ్బాయిని పోలీసులు తీవ్రంగా కొట్టి గాయాలపాలు చేశారు. ‘మమ్మల్ని మనుషులుగా చూసిన సందర్భాలే లేవు’ అని జోయా చెప్పింది. తమను హింసించిన వారిపై పోలీసుస్టేషన్ లో జోయా కేసుపెట్టింది. కానీ సంవత్సరం అయినా ఆ నేరస్థులకు శిక్షఫడలేదు. దీంతో నిరాశచెందిన జోయా మళ్లా ఎప్పుడూ పోలీసు స్టేషన్ వైపుకు వెళ్లలేదు.
రైళ్లల్లో ముష్టెత్తుకుంటూ డబ్బును కూడబెట్టింది. కొన్ని రోజులకు ఒక డిజిటల్ కెమెరా కొనక్కోవడానికి సరిపడినంత డబ్బు సమకూడింది. ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురయినా వెనకడుగువేయకుండా తన కలను సాకారం చేసుకోవడానికి డిజిటల్ కెమెరాను కొనుక్కుని జోయా ఫోటో జర్నలిస్టుగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. హైదరాబాదు వచ్చిన తర్వాత ఇక్కడ మరో గురు జోయాకు లభించింది. ఈ గురు జోయా జీవితాన్ని విజయబాట పట్టేట్టు చేసిందంటుంది జోయా. ‘ నా జీవితం ఇపుడు మారిపోయింది. ఇక నేను భయం లేకుండా బతకగలను’ అని జోయ అంది.
ట్రాన్స్ జండర్ జీవితాలపై చేసిన ఒక లఘు చిత్రం జోయా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘హిజ్రా షాప్ కి వర్తాన్ పార్ట్ 1 అనే లఘుచిత్రాన్నిజోయా యూట్యూబ్ లో చూసింది. దీనిలోని కొన్ని లోపాలను జోయా గుర్తించింది. వాటిని ఆ చిత్రం కామెంట్ సెక్షన్ లో పేర్కొంది. దాన్ని చదివిన ఆ చిత్ర డైరక్టర్ జోయాను కాంటాక్టు చేశారు. అలా ఆ లఘుచిత్రానికి నిర్మించిన మరో సీక్వెల్ కు జోయా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ చిత్రంలో జోయా పనితనానికి అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు ప్రదానోత్సవంలో మహారాష్ట్ర డైలీ యజమాని శ్రీనిధి సింగ్ ను కలిసింది. అప్పుడు జోయాకు తన పేపరులో రిపోర్టరుగా ఆయన అవకాశం ఇచ్చారు. అలా జోయా దేశ తొలి ట్రాన్స్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా రికార్డు స్రుష్టిచారు. రిపోర్టర్ జాబ్ చేస్తూనే ట్రయిన్లలో జోయా భిక్షాటన చేసేది. అలా కూడబెట్టిన డబ్బులతో 2019లో ముంబయి బోరాబజార్ లో సెకెండ్ హ్యాండ్ కెమెరా కొనుక్కుంది. ఆ సంవత్సరం జరిగిన పింక్ ర్యాలీ ఫోటోలను తీసింది. అందులో ట్రాన్స్ జండర్లు సమానహక్కుల కోసం ప్రదర్శన నిర్వహించారు. ‘ అక్కడే యురోపియన్ ప్రెస్ ఫోటో ఏజెన్సీకి పనిచేస్తున్న దివ్యకాంత్ సోలంకీని కలిశాను. సోలంకే నన్ను ఫోటోజర్నలిజం ఫీల్డ్ కు పరిచయం చేశారు. ఆయనను ఎన్నడూ మరవలేను’ అని జోయా చెప్పారు. 2020లో జోయా రైలులో ప్రయాణం చేసేటప్పుడు వేలమంది వలసకార్మికులు బంద్రా స్టేషన్ బయట నిరశనప్రదర్శన చేయడం చూసింది. వెంటనే ఇంటికి వెళ్లి తన కెమెరా తీసుకుని వచ్చి వాటితో ఆ ప్రదర్శనలను ఫోటో తీసింది. జోయా తీసిన ఆ ఫోటోలు పలు జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్లలో ప్రచురితమయ్యాయి. అలా తొలిసారి ప్రపంచానికి జోయా పేరు ఫోటో జర్నలిస్టుగా తెలిసింది. అప్పటి నుంచి కరోనా పాండమిక్ పై, వాక్సినేషన్ డ్రైవ్స్ పై జోయా ఎన్నో ఫోటోలు తీసింది. అదే సమయంలో స్ట్రీట్, వైల్డ్ లైఫ్ పోటోలపై కూడా జోయా తన ద్రుష్టిని సారించింది. తను తీసిన పలు చిత్రాలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫోస్టు చేయడం మొదలెట్టింది.
‘జర్నలిజం నా జీవితం తీరునే మార్చివేసింది. ఇది నాకు పని చూపడమే కాదు వ్యక్తిగా నాలో ఎంతో మార్పును తీసుకువచ్చింది’ అని జోయా ఆనందంగా చెప్పింది. పట్టుదల ఉంటే కలలను సాకారం చేసుకోవచ్చని జోయా అంటుంది. ట్రాన్స్ జండర్లు తమలో దాగున్న అద్బుతమైన హాబీలను ధైర్యంగా బయటపెట్టాలని, వాటికి తగిన రూపునిచ్చుకోవాలని, తమ ప్రతిభాపాటవాలను ప్రపంచానికి ప్రదర్శించాలని జోయా ఎప్పుడూ అంటారు.
అవమానాల నుంచి అందలాలకు…
నేను పుట్టుకతో మగవాడినైనా నాకు అమ్మాయిలాగ ఉండడం ఇష్టం. ఎప్పుడూ అమ్మాయిల మధ్యనే గడుపుతుండేదాన్ని. పద్దెనిమిదేళ్ల వయసులో ట్రాన్స్ జండర్ కమ్యూనిటీతో కలిసి ఉండడం మొదలెట్టాను. నన్ను నేను ట్రాన్స్ జండర్ గా అంగీకరించడానికి చాలాకాలం పట్టింది. తర్వాత నన్ను నేను యాక్సెప్టు చేసుకోగలిగాను. ట్రాన్స్ జండర్ కావడంతో నేను ఎక్కడికి వెళ్లినా నాకు హేళనలు, అవమానాలు తప్పలేదు. అలాగే ఈ అనుభవాల నేపథ్యంలో ఎంతోమంది మంచివాళ్లను కూడా కలిశాను. రైల్వేస్టేషన్ల దగ్గర, సిగ్నెళ్ల దగ్గర అడుక్కుని ఆ డబ్బులతో జీవితం గడిపేదాన్ని. పోలీసులకు దొరికినపుడు ఫైన్ కట్టాల్సివచ్చేది. నా పట్ల చాలామంది ప్రవర్తన చూస్తుంటే నేను ఈ సమాజానికి చెందినదాన్ని కాదన్నట్టు ఉండేది. కొందరు నన్ను తమ దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. నేను ట్రాన్స్ జండర్ అని నన్ను ముట్టుకునేవాళ్లు కూడా కాదు. ఇలాంటి సంఘటనలు మానసికంగా ఎంతో బాధను కలిగించేవి. ట్రాన్స్ జండర్ అయితే ఏమీ మేము మనుషులం కాదా అని చాలామందితో నేను కోపంగా అన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ట్రాన్స్ జండర్ ఫోటో జర్నలిస్టుగా నా వర్క్సుకు ఎందరో నిర్మాణాత్మకమైన విమర్శను అందించారు. రోజు రోజుకూ ప్రొఫెషనల్ ఫోటోజర్నలిస్టుగా ఎదిగేలా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా ఫోటోలను ఈ రంగంలో నిష్ణాతులైన సీనియర్లకు చూపిస్తూ నా వర్కును మరింత మెరుగుపరుచుకుంటున్నాను కూడా. చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టి మరీ నేను పెయింటింగ్, ఫోటో ఎగ్జిబిషన్లకు వెడుతుండేదానిని. అక్కడ గడిపే సమయం నాకెంతో సంతోషాన్నిచ్చేది. ఐదవ క్లాసు తర్వాత స్కూలు మానేసిన నేను ఓపెన్ స్కూల్ లో చేరాను. అక్కడ ఎంతోమంది కెమెరాలతో తిరిగేవారు. వారిని చూసినపుడల్లా నాకు ఎంతో ఉత్సుకతగా ఉండేది. కానీ నేను కూడా ఒక రోజు వారిలాగే కెమెరా చేతబట్టుకుంటానని అస్సలు అనుకోలేదు. నా కూడబెట్టుకున్న సంపాదనతో వయొలిన్ కొనుక్కుందామని వెళ్లిన నేను అనుకోకుండా సెకెండ్ హ్యాండ్ కెమెరా కొనుక్కున్నా. కానీ దానితో ఎలా ఫోటోలు తీయాలో తెలియలేదు. అప్పుడు నేను ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ ని కలిశాను. ఆయన్ని ఎలాంటి ఫోటోగ్రఫీకి ఎలాంటి లెన్స్ ఉపయోగించాలి, కెమెరా ఫీచర్స్, లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ , యాంగిల్స్ వంటివటన్నీంటి గురించీ అడిగాను. ఆయన అన్నీ నేర్పించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ ద్వారా కూడా ఫోటోగ్రఫీ గురించిన విషయాలను స్వయంగా నేర్చుకున్నా. అలా నేను నా విద్యకు పదును పెట్టుకుంటూ మెల్లమెల్లగా ప్రొఫెషనల్ ఫోటోజర్నలిస్టుగా మారాను.