ఏపీ మంత్రి భార్యకు ఐటీశాఖ షాకిచ్చింది. మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు బినామీ చట్టం కింద ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్ జిల్లా ఆస్పరిలో 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం రూ.52.42 లక్షల విలువైన కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపట్లేదని నోటీసుల్లో పేర్కొంది. ఒకేరోజు జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయినట్టు అధికారులు తెలిపారు. 180 ఎకరాల్లో రేణుకమ్మ పేరు మీద 30.83 ఎకరాలు రిజిస్టర్ అయిందని, మిగతా భూమి అంతా మంత్రి బినామీల పేర్లపై రిజిస్టర్ అయిందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
సరైన లెక్కలు లేకపోవడంతో మొత్తం 180 ఎకరాల భూమిని సీజ్ చేసినట్టు తెలిపారు. 90 రోజుల్లోగా ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఇన్ కం సోర్సులను తమకు ఇవ్వాలని, లేని పక్షంలో తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.