దేశంలోని కారాగారాలు బాగా క్రిక్కిరిసిపోతున్నాయని, ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు కలిసి ఈ ఆందోళనకర సమస్యకు వెంటనే పరిష్కారం కనుగొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వాలు జనాకర్షక చర్యల కింద కొన్ని ప్రత్యేక నేర సంబంధమైన శాసనాలు చేయడం, నేరస్థులకు బెయిల్ మంజూరు చేయడాన్ని మరింత కఠినతరం చేయడం వంటి పరిణామాలు జైళ్లు క్రిక్కిరిసిపోవడానికి చాలావరకు దోహదం చేస్తున్నాయి. రాష్ట్రపతి అంతటి వ్యక్తి ఈ పరిస్థితిపై జోక్యం చేసుకుని, ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను హెచ్చరించడం నిజంగా హర్షించదగిన విషయం. జైళ్లలో నేరస్థులను కుక్కేస్తున్నారని, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొత్తగా జైళ్లను నిర్మించాల్సిన దారుణ పరిస్థితి ఉత్పన్నమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనం నిజంగా సామాజిక పురోగతిని ఆశిస్తున్న వారమే అయితే జైళ్ల సంఖ్యను పెంచాల్సిన అవసరమేమిటని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న జైళ్లనే మూసేయడం మీద దృష్టి పెట్టాల్సి ఉందని ఆమె జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయ శాఖా మంత్రి ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తాను ఇంతకు మించి ఏమీ చెప్పలేనని కూడా ఆమె స్పష్టం చేశారు.
అంతకు కొద్ది రోజుల ముందు ఇదే అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ల మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగిన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బెయిల్ మంజూరు వ్యవహారాల్లో తరచూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడాన్ని రిజిజు తప్పుబట్టారు. బెయిల్ మంజురుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని దిగువ కోర్టులకే వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. బెయిల్ మంజూరు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి దిగువ కోర్టులు భయపడుతున్నాయని, ఫలితంగా సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు కేసులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తన ప్రసంగంలో బదులిచ్చారు. ఇక అసలు విషయానికొస్తే, భారత దేశంలో జైళ్లలో మగ్గుతున్న నేరస్థుల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే కాస్తంత ఎక్కువగానే ఉంటోందని 2021 నాటి నివేదిక తెలియజేసింది. 2016-2021 మధ్య జైళ్లలో శిక్షలు పడిన నేరస్థుల సంఖ్య 9.5 శాతం తగ్గగా, విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య 45.8శాతం పెరిగింది. జైళ్లలోని నేరస్థులలో మూడు వంతుల మంది విచారణలో ఉన్న ఖైదీలే కావడం వల్ల జైళ్లు క్రిక్కిరిసిపోవడమన్నది కేవలం విచారణలో ఉన్న ఖైదీల వల్లే జరుగుతోంది.
ఇక, 2021 డిసెంబర్ 31 వరకు సేకరించిన వివరాల ప్రకారం, ఇందులో 80 శాతం మంది ఖైదీలు ఏడాదిగా విచారణలో ఉన్నవారు. అంతేకాక, నిరుడు సుమారు 95 శాతం మంది ఖైదీలను బెయిలు మీద విడుదల చేశారు. శిక్షలు పడిన నేరస్థుల సంఖ్య 1.5 శాతం వరకు ఉంటుందని అంచనా. దిగువ కోర్టులలో నత్తనడకగా విచారణ జరుగుతున్నందువల్లే, జైళ్లలో విచారణ ఖైదీల సంఖ్య పెరుగుతోందని, అందువల్లే జైళ్లు క్రిక్కిరిసిపోతున్నాయని ఈ గణాంక వివరాల వల్ల అర్థమవుతోంది. ద్రౌపది ముర్ము చెప్పినట్టు, జైళ్ల సంఖ్యను పెంచడమన్నది ఈ గడ్డు సమస్యకు పరిష్కారం కానేకాదు. ఎప్పటి మాదిరిగా కాకుండా కాస్తంత భిన్నంగా ఆలోచించాల్సిందిగా సుప్రీంకోర్టు ఇటీవల ప్రభుత్వానికి సూచించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని కేసులకు సంబంధించిన ఖైదీలను విడుదల చేయాల్సిందిగా అది కోరింది. బెయిలు మంజూరుకు సంబంధించిన అంశాల పట్ల కొద్దిగా సడలింపు వైఖరిని అవలంభించాలనే సుప్రీం కోర్టు సూచనను దిగువ కోర్టులు కూడా అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. కాగా, విచారణలో ఉన్న ఖైదీలకు సకాలంలో బెయిలు మంజూరు చేయకపోవడం వల్లే జైళ్లలో ఖైదీల సంఖ్య పెరుగుతోందని, వారందరినీ లోపల ఉంచడానికి జైళ్లు సరిపోవడం లేదని వాదించడం కూడా సమంజసం కాదు. విచక్షణా రహితంగా వ్యక్తుల్ని అరెస్టు చేయడం కూడా ఇందుకు ప్రధాన కారణమే. నేరాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో జనాకర్షక విధానాలు అనుసరించడంతో అటు, బెయిలు మంజూరు విషయంలో కఠిన నిబంధనలు విధించడం ఈ రకమైన సమస్యలు సృష్టిస్తున్న మాట నిజమే కానీ, ప్రభుత్వం మరికొన్ని సమస్యలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. బెయిలుకు అవకాశం ఉన్నప్పటికీ, కొందరు ఖైదీలకు పూచీకత్తు చెల్లించే స్తోమత లేక జైళ్లలో మగ్గాల్సి వస్తోంది. ఏతావాతా, అటు ప్రభుత్వం, ఇటు న్యాయ వ్యవస్థలు ఈ సంక్షోభంపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం చాలా అవసరం.