దేశంలోనే మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక స్వావలంభన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. త్వరలో చేపట్టనున్న రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అంశంపై.. బుధవారం ఉదయం పటాన్చెరువు మండలం పార్టీ గ్రామ పరిధిలోని ప్రైవేటు ఫంక్షన్ హాలులో నియోజకవర్గస్థాయి గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో మొత్తం 1509 మంది సభ్యులు సహకార సంఘంలో సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరిలో ఇప్పటివరకు 500 మంది మాత్రమే సబ్సిడీ మొత్తాన్ని చెల్లించడం జరిగిందని తెలిపారు. 20 మేకలు ఒక పోటేలు కూడిన యూనిట్ ధర ఒక లక్ష 75 వేల రూపాయలు కాగా సభ్యుడు 43,750 రూపాయలు చెల్లించాలని, ప్రభుత్వం ఒక లక్ష 31 వేల 350 రూపాయలు సబ్సిడీ చెల్లిస్తోందని తెలిపారు. ప్రతి సభ్యుడు తమ వాటా చెల్లించేలా సంఘం అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈనెల 28 లోపు 100% చెల్లింపులు జరగాలని అధికారులను ఆదేశించారు. గుమ్మడిదల, జిన్నారం మండలాల పరిధిలో గొర్రెలను మేపే సమయంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో చెల్లింపులు జరిగిన అనంతరం త్వరితగతిన యూనిట్లు అందించేలా జిల్లా కలెక్టర్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకాన్ని ప్రతి సభ్యుడు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా పరిపుష్టి చెందాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాస్ రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి, గొల్ల కురుమల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు నగేష్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు పుష్ప నగేష్, మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, ఎంపిడిఓలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, బాల్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.