Single Use Plastic Ban : సింగిల్ యూజ్(ఒక్కసారి వాడి పారేసే) ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని వినియోగిస్తే జరిమానా విధించేందుకు సిద్దమైంది. కాలుష్యాన్ని సృష్టించే వారే వ్యయాన్ని కూడా భరించాలన్న సూత్రం ఆధారంగా జరిమానాలను విధించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది.
నిషేదించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై తొలిసారి తప్పుగా పరిగణిస్తే రూ.50వేలు, రెండో సారి లక్ష వరకు జరిమానా విధించనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను స్టాక్ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధిస్తారు. దీంతో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కేజీకి రూ.10 చొప్పున పెనాల్టీ వేయనున్నారు. ఇక వీధి వ్యాపారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగిస్తే రూ.2500 నుంచి రూ.5వేల వరకు జరిమానా పడనుంది. సంస్థలు, మాల్స్, దుకాణాలు లాంటి చోట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు అమ్మితే రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు జరిమానా వేయనున్నారు.
పాలిథీన్ క్యారీబ్యాగుల ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్స్ కంపెనీలపైనా దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సూచించింది. ప్లాస్టిక్ వినియోగంపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.