Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో మెదలాలి

Karimnagar: ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో మెదలాలి


ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో మెదలాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల జరిగే ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు నష్టపోతాయన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వేసవి తీవ్రత నుండి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు కరీంనగర్ పాల డెయిరీ యాజమాన్యం ఉచితంగా మజ్జిగ అందజేసే కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు డెయిరీ ఛైర్మెన్ చలిమెడ రాజేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ట్రాఫిక్ నియంత్రణకు దోహదపడే 50 స్టాపర్లను డెయిరీ యాజమాన్య అందజేసింది. ఈ కార్యక్రమం కమిషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో జరిగింది.

- Advertisement -

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. ట్రాఫికకు అంతరాయం కలుగకుండా వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుతున్నాయని తెలిపారు. వాహనదారులు ధృవపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలిచ్చే వాహనాల యజమానులతోపాటు తల్లిదండ్రులపై కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులకు ఉచితంగా మజ్జిగను అందజేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు దోహదపడే స్టాపర్లను అందజేసిన కరీంనగర్ డెయిరీ నిర్వాహకులకు సి.పి. కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సహకారం అందజేయడంతో పాటు 1,500 గ్రామాల్లోని ప్రజలకు పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడం అభినందనీయమన్నారు.

కరీంనగర్ డెయిరీ ఛైర్మెన్ చలిమెడ రాజేశ్వరరావు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ విధులతో పాటు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎండనకా.. వాననకా.. శ్రమిస్తున్న పోలీసులకు తమవంతు సహకారం అందజేస్తామన్నారు. భవిషత్తులో చేపట్టే కార్యక్రమాలకు సైతం తమ సహకారం కొనసాగుతుందని చెప్పారు. డిసిపి (పరిపాలన) జి.చంద్రమోహన్ మాట్లాడుతూ గూడ్స్ ట్రాలీల వాహనదారులు, డ్రైవర్లు ట్రాఫిక్ నకు అంతరాయం కలుగకుండా వాహనాలను నడపాలని, యూనిఫామ్ ను విధిగా ధరించాలన్నారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోయినట్లయితే చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టంచేశారు.

అనంతరం ట్రాఫిక్ పోలీసులకు ఉచితంగా మజ్జిగ సరఫరా చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు దోహదపడే స్థాపర్లను అందజేసిన కరీంనగర్ డెయిరీ ఛైర్మెన్ రాజేశ్వరరావును పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏసిపిలు తుల శ్రీనివాసరావు, బి.విజయకుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జునరావు, కరీంనగర్ డెయిరీ మేనేజర్ రాజశేఖరెడ్డి, ట్రాలీ డ్రైవర్లు, యజమానులతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News